Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు ఇక్కడ అంతా మారిపోయాయి..
రాజకీయాలు
కొత్త రంగులు పులుముకున్నాయి
నాయకులు
కొత్త మాస్కులు తొడుక్కున్నారు...
వీలు కుదిరినప్పుడల్లా..
చొరవ చేసుకొనిమరీ
జాతీయ జెండాకు
మతమనే కొత్త రంగును..
ప్రజలకు కులమనే
వింత రోగాన్ని అంటిస్తునేవున్నారు..
ఇక్కడ ఇప్పుడు అంతా మారిపోయాయి..
కోట్ల సంపద కొందరి జేబుల్లోకి
సోమరొడ్ని చేసే ఉచిత హామీలు
సామాన్యుల కంచాల్లోకి వచ్చేస్తున్నాయి..
ప్రతీ సంఘానికి ఓ భజన బృందం
వీలు పడినప్పుడల్లా కలహాల కచేరీలు
ఇప్పుడు ఇక్కడ షరామాములే..!
చైతన్యాన్ని గాలికొదిలేసి
పూటకో పాటటెత్తుకోడం
ఇక్కడ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది..
దారితప్పి ఈ దిక్కుకొచ్చిన ఓ బాటసారి.!
న్యాయంగా జరిగే ఇక్కడి అన్యాయానికి
ధర్మంగా జరిగే ఇక్కడి అధర్మానికి
అడ్డుపడే ఆలోచనలు మానుకో...
చుట్టుపు చూపులా వచ్చిన నీలోని చైతన్యాన్ని
ఈ సమస్యలకు జవాబుదారిని చేయకు..
అభివృద్ధి జెండాల గూర్చి
మాట్లాడే వాళ్ళు ఇప్పుడు లేరిక్కడ ..!
వర్గాలుగా కొట్టుకోడానికే సమయం లేదు
ప్రశ్నించడానికి తావెక్కడది..!
మతమే రాజకీయంగా
రాజకీయమే మతంగా మారిపోయాక
ఉద్యమ గీతాలకు శ్రోతల కరువొచ్చింది..!
ఐనాసరే తరాలుగా
కూరుకుపోయిన మౌఢ్యాన్ని
కూకటి వేళ్ళతో కూల్చి
సిసలైన మార్పు మొదలయ్యేవరకు
పట్టువిడువక యుద్ధం చేసే
ఓపికుందంటే చెప్పు
నీ గాత్రానికి నా గొంతు కలిపి
నీ పోరాటంలో మార్గాన అడుగు కదిపి
నీ చైతన్య గీతాలాపనకు కోరస్ ఇస్తా...
ప్రాణం ఉన్నంత వరకు..!
- గుడిసె రాజశేఖర్
9885717740