Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దెల్ల తిరిగినా
ఆవగింజంత యాస్టకు రాదు
ఉయ్యాలకట్టి ఊపినట్లు
బస్సెక్కంగనే జోరుగా నిద్ర
సూర్యుడు
భూమంతా తిరిగి గూటికి చేరినట్లు
అమ్మ ఒడిలా హాయిగా ప్రయాణం !
టాపుమీదెక్కి కూసున్నా
మూలమలుపులల్లో బెత్తెడంతా వొరుగదు
వొంపులొంకలు గుంతలుమిట్టలు, దాటుకుంట
గడ్డివామోలే ఊరిలకు బస్సొస్తుంటే
నాయిననే డ్రైవరై బిస్సపట్టి నడిపిస్తున్నట్లుంటది
సురక్షితంగా ఆర్టీసీ ప్రయాణం ...!
పల్లె నుండి పట్నానికి
తోలుకొచ్చిన మొదటి జిగ్రిదోస్తు
టికెట్ లేకుండానే
పిల్లలను బడికాడ దింపి బాయిచెప్తది
అయిదేళ్లదాక పిల్లలకు ఉచితం
దివ్యాంగులకు ప్రేమతో మొదటి సీటిస్తది
33 శాతం మహిళా రిజర్వేషన్
అమలు చేసిన తొలి అభ్యుదయం ఆర్టీసీ
అవ్వతాత నుండి
సంకల బిడ్డ వరకు నాయినమ్మలా
భుజాలమీద మోసుకొచ్చె అపర సేవామూర్తి
కార్మిక కర్షక శ్రామిక బండి బస్సమ్మ
కులాల కుర్చీలు పెత్తనాల పీటలు లేవు
వ్యక్తిత్వాల కలపోత ప్రయాణికులే గుండెబలం
చెయ్యెత్తుతే ఆగుతది రైటంటే కదులుతది
ఆపతికో అవసరానికో, దేవునికాడికో
సుట్టాల మార్గమో.. పెండ్లి కార్యానికో....
ఆర్టీసీ బస్సెక్కాల్సిందే
కాదంటే కాళ్లకు బుద్దిచెప్పాల్సిందే...
ఒక్కొక్కసారి కాన్పులు కూడ బస్సులనే
అమ్మమ్మలా మంత్రసానై పురుడుపోస్తది
వాంతులు చేసుకున్నా , పిల్లలు ఉచ్చపోసినా
పొగాకు గుట్కాపాన్ నమిలి బుద్థిలేనోళ్ళు
తుపుక్కున ఉమ్మినా సీదరిచ్చుకోదు
అల్కుపిడ్సతో ఇల్లలికినట్లు
పరిశుభ్రంగా పొద్దునా పల్లెవెలుగు బస్సు....
స్టేజిస్టేజి కాడ ఎక్కిదిగే ప్రయాణికులు
టికెట్లకు సమంగా ప్యాసింజర్ని లెక్కపెట్టాలె
రన్నింగ్ లనే యస్ ఆర్ పూర్తిచేసే నైపుణ్యం
అడుగడుగున చెకింగ్లు
చాయికో టిపిన్ కో దిగిన ప్రయాణికుడు
ఆల్స్యమైతే ప్రయాణికుల ఆగ్రహాలు
ఒపికతో పెద్దన్నలా భరించె కండక్టర్
మతితప్పి మర్చిపోయి గురుకపెట్టినా
నీ ఊరొచ్చిందని నిన్ను నిద్రలేపే భరోసా !
నెత్తిమీది ఎండకాక, కాళ్లకింద ఇంజన్ సెగ
కుతకుత మాంసంలా ఉడికే డ్రైవర్
వానల్ల తడుస్తూ సలిల వొణుకుతూ డ్యూటీ
తారురోడును తండాను, ఊరును నగరాన్ని,
కులాన్ని మతాన్ని, మనిషిని వర్గాన్ని దేశాన్ని
ఒకేతాన పూలబుట్టిలా మోసుకుపోయే బస్సు
జాతీయ సమైక్యతకు నిలువుటద్దం
బస్సులో సీటుదొరికితే
కాలేజిలో సీటు దొరికినంత కుశాలు
కిటికీదగ్గర కూసుంటే
సినిమా రీళ్లలాఎన్నెన్ని దృశ్యాలో..
చేతికందే చెట్లకొమ్మలు పలుకరిచ్చె పక్షులు
మనం ఉరుకుతున్నట్లు
మనెంబటే ఉరుకొచ్చె కొండలు గుట్టలు
ఉయ్యాలై నిద్రపోవొచ్చు చదువుకోవొచ్చు
భుజం దింపకుండా
పదూర్లను చూపిచ్చె పెద్దమ్మతల్లి
ప్రయాణంలో తీరని కాపురాల ముచ్చట్లు
ఎదలోతులనుండి సేతానం సంగతులు
మనసులు విప్పి మాట్లాడుకునే ప్రేమలు
ఆసుపత్రులకాడ ఎక్కిదిగే రోగుల అవస్థలు
వ్యాపారుల ఉరుకులాటలు
పదిరూపాయలు
నలుగురు పంచుకునే తండ్లాటలు
స్టేజిదాటిపోతే డ్రైవర్ పై భగభగ కోపాలు
గాలంత సందులేకుండా
పుట్ బోర్డ్ నిండా కాలేజిపోరలు అల్లరల్లరి
సకలచర్చల వేదిక సమతా వాహనం
అమ్మకు సుస్తయినా
బస్సుమ్మకు జ్వరం రాదు
ఎరుపు నుండి
ఆకుపచ్చరంగు మారినా రూటు మార్చుకోలే
ప్రజలకోసం పరుగెత్తుకొస్తది
ప్రజలకోసం ప్రాణమిచ్చింది
నాకు
ఆర్టిసి బస్సులో ప్రయాణం చేసినప్పడల్లా
కవి సమ్మేళనంలో కవిత చదువుతున్నట్లే ..
రేపటి నా దీర్ఘకావ్యం ఆర్టిసి కన్నీళ్లు
నాడు ఊరుఊరంతా బస్సుకోసం ఎదిరిచూస్తే
నేడు బస్సు మనిషికోసం ఎదిరిచూస్తున్నది !
- వనపట్ల సుబ్బయ్య
9492765358