Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మను, నాన్నను, ఉన్న ఊరును తన కవిత్వంలో స్పృశించని కవి బహుశా ఉండకపోవచ్చు. అయితే ఏక వస్తుకంగా పుస్తకాలు రాసిన కవులు మాత్రం అరుదు గానే కనిపిస్తారు. అందులోనూ ఇటీవల కాలంలో విశ్వవ్యాప్తమైన ప్రక్రియ నానీలలో అమ్మ వస్తువుగా ఒక పుస్తకం, నాన్న వస్తువుగా మరొక పుస్తకం తెలుగు సాహిత్యంలో వెలువరించిన ఏకైక కవి వెన్నెల సత్యం. వెన్నెల సత్యం కవి, సామాజిక స్పృహ ఉన్న అభ్యుదయ పథగామి, ఉత్తమ ఉపాధ్యాయుడు ఇలా బహుముఖీనమైన కోణాలలో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న విలక్షణ సాహితీవేత్త. వెన్నెల సత్యం తెలుగు సాహిత్యానికి అందిస్తున్న మరొక ఆణిముత్యం 'నాన్న నానీలు'.
నాన్న గురించి రాస్తే/ కావ్యాలు చాలవు/ పాతిక అక్షరాల్లో/ ప్రయత్నిస్తున్నా.. అంటూ సవినయంగా ప్రకటించుకున్న ఈ కవి ఈ చిన్న కవితలలో నాన్నను సమున్నతంగా ఆవిష్కరించడంలో సఫలీకృతుడయ్యాడు.
'జీవితం అర్థానికై/ వెతుకుతున్నాను/నాన్న నిఘంటువు/ నాకు దొరికింది'. నాన్న ప్రభావం పిల్లల మీద ఎనలేనిది. అందుకే వెన్నెల సత్యం నాన్నను నిఘంటువుతో అభేదం చెప్పాడు. జీవిత సారాన్ని తన అనుభవం ద్వారా ఆచరణ ద్వారా పిల్లలకు అందించే నాన్న నిజంగా నిఘంటు సమానుడే.
నీ అడుగులు/ కందిపోకుండా చూసాడు/ నెర్రెలచ్చిన/ నాన్న పాదాలు చూడు నాన్న త్యాగానికి ప్రతిరూపం. తన పిల్లల కోసం తాను పడ్డ కష్టాన్ని లెక్క చేయడు. పిల్లల సుఖసంతోషాలే పరమావధిగా భావిస్తాడు. దీనిని కవి అందంగా తన బిడ్డల అడుగులు కందిపోకుండా కాపాడే తండ్రి తన కాళ్ల పగుళ్లను కూడా లెక్కచేయడని చెప్తాడు.
'అమ్మ కడుపులో/ నవమాసాలు/ నాన్న గుండెలో/ బతుకంతా నీవే' కవుల కవిత్వంలో అమ్మకు దక్కినంత స్థానం నాన్నకు దక్కలేదనే చెప్పాలి. నాన్న మీద అనంతమైన ప్రేమాభిమానాలు కలిగిన ఈ కవి తల్లి నవమాసాలు మోస్తే నాన్న తన గుండెల్లో జీవితాంతం మోస్తాడని తన కృతజ్ఞతను ప్రకటించాడు.
కష్టాల గరళం/ నాన్న గొంతులో/సుఖాల అమృతం/ పిల్లల భవితలో తాను ఎంతటి కష్టాలైనా భరించి తన పిల్లలు మాత్రం సుఖంగా ఉండాలని కోరుకునే నాన్న త్యాగనిరతిని అలవోకగా అలతి అలతి పదాలలో చెప్పారు. కుటుంబ భారాన్ని నిర్వహించాలి అంటే కష్టాల సంద్రాన్ని ఈదక తప్పదు. కష్టాలు ఎన్ని ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగే నాన్న మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక పాఠమై నిలుస్తాడు
నాన్న మీద/ కష్టాల దండయాత్ర/ ధైర్యమే వదలడు /కరవాలం దూస్తాడు. జీవిత సమరంలో కష్టాలపై కత్తి దూసి పోరాడే వీరుడిగా నాన్న గొప్పదనాన్ని కీర్తించారు వెన్నెల సత్యం. దుఃఖాన్ని దరి చేరనీయకుండా నిరంతరం ఎదురు ఇదే నాన్నను చూస్తే దుఃఖం కూడా దుఃఖిస్తుందని చమత్కరిస్తాడు.
నాన్నను చూస్తే/ ఏడుపుకి కూడా ఏడుపు/ తననెప్పుడూ/ ఆశ్రయించడని... నాన్న ధైర్యానికి పర్యాయపదం. శ్రమించే తత్వానికి నిలువుటద్దం. తన కుటుంబం కోసం తన పిల్లల కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించగల తత్వం నాన్నది.
ఆ సూర్యుడి విధి/ పన్నెండు గంటలే/ నాన్న డ్యూటీ / ఇరవై నాలుగ్గంటలు ప్రకృతిలో భాగమైన సూర్యుడు నిరంతరం తన విధి తాను నిర్వహించినట్లే నాన్న కూడా మనకోసం నిరంతరం శ్రమిస్తాడని ఈ నాని ద్వారా తెలియచెప్పారు. త్యాగానికి చిరునామా నాన్న. తన శరీరం కృషించి పోయేదాకా పిల్లల కోసం సంతోషంతో శ్రమిస్తాడు.
పిల్లల భవితకు/ తీపిని అద్దాడు/ నాన్న ఇపుడు/ఒట్టి చెరుకు పిప్పి అనే నాని నాన్న త్యాగబుద్ధిని అందంగా ఆవిష్కరిస్తుంది. మనకు తీపిని పంచి తాను మాత్రం కొంగి కృషించి చెరుకు పిప్పిలా మారిపోయే నాన్న రుణం తీరనిది.
బతుకు దీపం/ ఆరిపోనివ్వడు/ నాన్న చేతులే/రక్షణ కవచం... 'శిక్షణలో తల్లి రక్షణలో తండ్రి' పెద్దల మాటకు ప్రతీక ఈ నాని. మన జీవితాన్ని కాపాడడం కోసం తాను రక్షణ కోసం నిలుస్తాడు. దీపం ఆరి పోకుండా చేతులు అడ్డు పెట్టే అందమైన ఉపమానంతో తండ్రి మనలను రక్షిస్తున్న వైనాన్ని కవి అత్యంత అందంగా చెప్పగలిగాడు. నాన్నను అనేక కోణాల నుంచి కవిత్వీకరించిన ఈ కవి నాన్న రక్షణ కవచంగా నిలుస్తాడు అనడానికి నిదర్శనంగా కంటిరెప్పతో పోల్చాడు. ఆపత్కాలంలో అసంకల్పితంగా కంటి రెప్ప కన్నును కాపాడినట్లు నిరంతరం అప్రమత్తతతో తన పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాడని లోతైన భావాన్ని ఈ చిన్న నాని లో ఎలా చెప్పారో చూడండి.
నాన్నంటే/ కంటికి రెప్పనే కాదు/ లోకాన్ని చూపే/ మూడోకన్ను శిశువుకు మాటలు నేర్పేది తల్లి అయినా సమాజాన్ని పరిచయం చేసేది నాన్న. అందుకే నాన్నను జ్ఞాన నేత్రంతో పోల్చాడు. మూడో కన్నుగా అభివర్ణించాడు.
తన కొడుకును లేదా కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో అవసరమైతే కోపిస్తాడు నాన్న. దాన్ని అపార్థం చేసుకోవలసిన అవసరం లేదంటాడు కవి. నాన్న కోపానికి తప్పకుండా అర్థం ఉండి ఉంటుంది.
క్రమశిక్షణ/ నాన్న వేసే శిక్ష కాదు/ బంగారు భవితకు/ అది శిక్షణ ఈ విషయం కొడుకులకు అర్థం కాక తండ్రి నీ ఓ శత్రువులా చూస్తాడు అంటాడు. తండ్రి పట్ల అకారణంగా ద్వేషం పెంచుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికాలంలో నాన్నను బాల్యంలో మిత్రుడిగా, యవ్వనంలో శత్రువుగా, వృద్ధాప్యంలో చాదస్తుడుగా భావించడం పరిపాటిగా మారిపోయిందని వాపోయారు.
బీరువాలో/ నాన్న రాసిన లేఖ/ క్రమశిక్షణ తప్పితే/ హెచ్చరిస్తూ నాన్న హెచ్చరికలతో కూడిన లేఖ మన జీవిత గమనానికి దిక్సూచి వంటిదని మన జీవితాంతం కూడా మనలను నడిపిస్తుందనే సందేశం ఇచ్చిన నాని ఇది. నాన్న తిట్లు కూడా దీవెనలే అని నాన్న తిట్టాడని బాధపడవలసిన అవసరం లేదని తెలిపే నానీలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి. తండ్రి విశాల హృదయాన్ని ఆవిష్కరించే నానీలు అనేకం ఈ సంపుటిలో కనిపిస్తాయి.
నిచ్చెనలాంటి నాన్న/ లిఫ్ట్ అయ్యాడు/ పిల్లలు వేగంగా/ నూరో అంతస్తులో పిల్లలను జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకురావడానికి తాను నిచ్చెనగా మారుతున్న వైనాన్ని ఆధునిక కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న యువతను దృష్టిలో ఉంచుకొని అంతే అత్యాధునికమైన ప్రతీక నాన్నను లిఫ్ట్‌తో పోల్చడం కవి భావనాబలానికి నిదర్శనం. ఆకాశమంత విశాలమైన నాన్న ప్రేమను దర్శించడం అంత సులువు కాదంటాడు. అందుకే నాన్న ప్రేమ/దృశ్యమానం కాదు/ నీ హృదయమే/ ఒక పెరిస్కోప్ కావాలి
హృదయం అనే పెరిస్కోప్తో మాత్రమే నాన్న ప్రేమను దర్శించగలమని చెప్పే కవి మాటలు ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
'కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు' అంటారు ఒకానొక సందర్భంలో మహాకవి గుర్రం జాషువా. కవిని గన్న తండ్రి జన్మ కూడా ధన్యమే అనిపిస్తోంది ఈ నానీలను చూస్తుంటే.
మా భవితకు/ రూపం ఇచ్చాయి /నాన్న చేతిలో / ఉలి బాడిశె వెన్నెల సత్యం తండ్రిగారు శ్రీ వడ్ల వెంకట రాములు. వృత్తిరీత్యా వడ్రంగం నిర్వ హించేవారు. కులవృత్తిని చేస్తూ తమను ప్రయో జకులుగా తీర్చిదిద్దిన తండ్రి పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్న నాని ఇది. ఒక తండ్రిగా ప్రయోజకు డైన కొడుకును చూసి గర్వించని తండ్రి ఉండడు కదా! తాను ప్రయోజకుడుగా తీర్చిదిద్దిన కొడుకు తన పట్ల కృతజ్ఞతలు ప్రకటించడం అదృష్టమే కదా!
ఈ రోజులలో తాము పస్తులు ఉండి కూడా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తండ్రులు ఎందరో వృద్ధాశ్రమాలలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. కొడుకులు కోడళ్ళ చేతిలో ఈసడింపులకు గురవుతున్నారు. సమాజంలో ఈ దుస్థితిని వెన్నెల సత్యం తీవ్రంగా నిరసించారు.
నాన్న/ కనిపించని పునాది/ మరి కొడుకు/ పునాదిని మరిచే భవంతి మూలాలను మరిచిపోయి అహంకారంతో తల్లిదండ్రులను దూరం చేసుకునే కొడుకులకు చెంపపెట్టు లాంటి నాని ఇది. ఇట్లా వ్యాఖ్యానిస్తూ పోతే ఈ పుస్తకంలోని ప్రతి నాని ప్రస్తావించదగినదే.
వచన కవిత్వం, గజల్, రుబాయి, హైకు, మినీ కవిత, నాని, పద్యం ఇలా అనేక ప్రక్రియలలో సాహితీ సేద్యం చేస్తున్న వెన్నెల సత్యం అభినందనీయులు. నాన్నను కవిత్వ పల్లకి ఎక్కించి సాహిత్య వీధులలో ఊరేగిస్తున్న వెన్నెల సత్యం 'నాన్న నానీల'కు స్వాగతం పలుకుతూ ఉత్తరోత్తర వీరి కలం నుంచి మరిన్ని సత్కావ్యాలు జాలువారాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
- సాగర్ల సత్తయ్య, 7989117415