Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకానొక తెలియని చౌరస్తాలో
ఒంటరి బంటులా నిలబడ్డా
ఏ దిక్కుకెల్లాలో అర్థమవ్వక
బికారిలా బిక్కమొహమేశా!
మా వైపుకే రమ్మంటూ
కూడలిలో ఉన్న దారులన్నీ
కూడబలుక్కొని బతిమాలుతున్నాయి
ఒక దిక్కుకెళ్తే
మిగతా మూడు దిక్కులు
దిక్కులేనివౌతయనిపించవట్టె
ఒక దారంటా
ఆకుపచ్చని చెట్లు
కొమ్మల వింజామరలతో
అలరిస్తూ పిలుస్తున్నవి
నాతో జతకడితే అలసిన నిన్ను
ఊహల ఊయలలో తిప్పి
మేఘాలలో సేద తీరుస్తామంటున్నవి
ఇంకో దారెమ్మటా
పరుచుకున్న పూల రెమ్మలు
గుత్తులు గుత్తులుగా విచ్చుకొని
మత్తుగా కవ్విస్తున్నవి
ఈ వేపున వెళ్తే
సాధన శోధనలిక చాలించి
హాయిగా సేదతీరవచ్చనిపిస్తున్నది
మరో బాటంటా
ఆకలిదప్పులు తీర్చే
తీరొక్క కాయలు పండ్లు
నోరూరిస్తూ నోరార పిలుస్తున్నవి
సెలయేర్లు సంగీత కచేరితో
స్వాగతం పలుకుతున్నవి
చిలుకలు, పిచ్చుకలు రుచి చూసి
మెచ్చిచ్చిన ప్రశంసా పత్రాలు
కొమ్మల మెడలకు వేలాడుతున్నవి
చూసిన రుచి చూడకుండా
సంవత్సరమంతా కొత్త రుచులతో
కొంగత్త జీవితం
కొంటెగా గడపవచ్చనిపిస్తుంది
మిగిలిన తొవ్వెంటా
చిక్కుముడుల్లా చుట్టుకుంటూ
చిక్కుడు పాదుల్లా అల్లుకున్న పందిళ్ళు
అడుగు తీసి అడిగేస్తే
గుచ్చుకునే ముల్లకంపలు
తిప్పల తెప్పల్లో తిప్పే రాళ్లు రప్పలు
ఏదో ఆసరా చేసుకొని ముందుకెల్తే
ఒర్సుకుంటూ పరాష్కమాడే
పరిక్కంపలు, పల్లేరు కాయలు
వచ్చేటప్పుడు ఎటెల్తే
ఏం ఫాయిదా ఉంటదోనని
జాతకమన్న చూపించుకోకపోతిని
చెమట సుక్కల వారసుణ్ణి
నాకు జాతకాలెందుకులే!
నా అవసరం ఉన్నోళ్లకు
ఆసరానందించడానికి వెళ్తున్నా
ఇటేపు ఎవరైనా ఉంటే
నావేపు రండి కొత్త దారులేద్దాం!
- గంగాపురం శ్రీనివాస్
9676305949