Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చావా శివకోటితో నాకు దాదాపు రెండు దశాబ్దాల పరిచయం. ఈ మధ్యలో మా మధ్య ఎన్నెన్నో ముచ్చట్లు, కబుర్లు. ముఖ్యంగా ఆయన నిరాడంబరుడు. సహృదయుడు. చిన్న వాళ్లతో చిన్నవాడుగా పెద్దవాళ్ళకు పెద్దవాడుగా అందరితో అజాత శత్రువు అనిపించుకున్నాడు.
ఆ రోజు నాకు బాగా గుర్తు నేను రావెళ్ళ వెంకట రామారావు ఇంటికి వెళ్లాను. అప్పుడు నేను అడవి మద్దులపల్లి హైస్కూలులో పని చేస్తున్నాను. అప్పుడప్పుడూ కవితలు రాసి గురువు రావెళ్ళకు వినిపిస్తూ ఉండేవాడిని. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్ళలో రావెళ్ళ ముఖ్యులు. కొలిపాక మధుసూదనరావు ద్వారా పరిచయం కలిగింది. వారితో గడిపినవన్నీ మధుర క్షణాలే.
ఆ రోజు శివకోటి వారి ఇంటి ముందు వరండాలో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నారు. రావెళ్ళ నాకు ఆయన్ను చూపించి ఆయనే శివకోటి నీకు తెలుసా!. రా పరిచయం చేస్తాను అని తీసుకుపోయి ఆయనకు పరిచయం చేశారు. పరిచయాలూ అవీ అయిం తర్వాత శివకోటి 'మాస్టారూ! కౌముది మీకు తెలుసా!' అన్నారు. అప్పటికి నాకు నేను పందిళ్ళపల్లిలో ఉండగానే కౌముది చింతకానితో పని చేస్తుండటాను పరిచయమే. నాకు తెలుసు అన్నాను. అయితే ఇకనేం అప్పుడప్పుడూ కలుసుకుందాంలే అన్నారు. ఇంతలో ఎవరో ఆయనను కలుసుకోవటానికి వస్తే నేను సెలవు తీసుకుని వచ్చాను. ఆ రోజున మొదలయిన శివకోటి పరిచయం ఇటీవలి దాకా అలాగే వుంది.
ఆయన 'కథలోరు కథలు' అనే పుస్తకం నాకిచ్చి దీని మీద నీ అభిప్రాయం చెప్పు అన్నారు. దాన్ని చదివి నా అభిప్రాయం చెపితే భుజం తట్టి బాగుంది అని మెచ్చుకున్నారు.
శివకోటి అసురగణం నవల ఆంధ్రజ్యోతిలో ప్రచురించే సమయంలో మా వంశీ జ్యోతిలో పని చేస్తున్నాడు. సీరియల్ పూర్తికాక ముందే ఆ కథ మొత్తం నాకు తెలిసింది. అంటే ఆయనే నాకు సూచనప్రాయంగా చెప్పారు.
ఆయన రాసిన కథలలో నాకు నచ్చిన కథ తెలంగాణా ఉద్యమాలు రాకముందు రాసింది. అందులో గడీల అంత:పుర రహస్యాలు, దొరల పెత్తనాలు, దొరసానుల గుట్టు మొత్తం రట్టు చేశారు. తెలంగాణకే పరిమితమయిన ఆడపాపల విషయం అందులో సమగ్రంగా వివరించారు.
ఆయన నాకు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. శ్రీశ్రీ పద్యాలు కూడా రాశారని, అప్పుడు శ్రీశ్రీ పక్కన తానున్నానని చెప్పారు. అలాగే ఇంకో విషయం దర్శకుడు శ్యాం బెనగళ్ మన తెలుగువాడేనని ఆయన పేరు వెనిగళ్ళ శ్యాంసుందర్ అని చెపితే నిజమా! అని ఆశ్చర్యపోయాను. సాహితీ హారతి ప్రోగ్రాములలో రంగాచారిని పరిచయం చేసింది శివకోటినే. రంగాచారితో ఆయన పోయే వరకు కొనసాగింది.
చెప్పాలంటే ఆయన నాకు ఆప్తమిత్రుడే కాక మార్గదర్శి కూడా. అనేక విషయాలు నాతో పంచుకునే వారు.
ఈ రోజు ఆయన భౌతికంగా మనను వదిలిపోయినా ఆయన రచనల ద్వారా చిరంజీవిగానే ఉంటారు. ఇంకో విషయం ఒక రోజు ఆయన నన్ను పిలిచి నరిసింహారావ్! నా పుస్తకాల మీద కొన్ని విశ్లేషణ వ్యాసాలు రాసి నాకివ్వు ప్రచురిద్దాం అని పుస్తకాలు ఇచ్చారు. తరువాత ఒకరు నా దగ్గరకు వచ్చి శివకోటి నవలల మీద పిహెచ్డీ చేస్తున్నాను. మీ దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయట ఇస్తారా! ఆయన ఎవరో గుర్తురావటం లేదు. ఆయనకు కావలసిన కొన్ని పుస్తకాలు తీసుకొని వెళ్ళారు.
ఆ వ్యాసాలు రాసి త్వరలోనే పూర్తి చేద్దామనుకుంటున్నాను. శివకోటి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
- తాటికొండాల నరసింహారావు, 98857 87250