Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దులేపుతుంటే
చెరువు తెడల రెప్పలు తెరుచుకుంది
రాత్రి నిశ్శబ్దపు లోతుల్లో...
ఏవో ఎనకటి నీడలు కలుసుకున్నయి
చెప్పరాని రగస్యాన్ని ఏ చాప విన్నదో కాని
పొద్దున్నే ఇసుకబోర అంతా గుస గుస
ఆకుల్ని చెవుల్ని చేసుకొని
చెట్లు అటు వ్కెపు వొంగి ఉన్నయి
ఆగి పోయిన క్షణాలు ఆడి పాడినయి
అక్కడంతా బూడిద రంగుల అడుగులే
సుక్క కోడి కొడిపను పొడుస్తుంది
శెలగ సెరువంతా సెలగేస్తుంది
అప్పుడప్పుడు పొద్దు దిక్కుకి ఎగిరి
రెక్కలు కాపుకుంటున్నయి
మనయి పైకెగిరే రెక్కలు
అతనియి నీళ్లళ్ళో ఈదే రెక్కలు
అంటూ మ్కెల బందంలోకి పక్షులొచ్చినయి
ఆత్మలా అల్లుకున్న పిట్ట గూళ్ళల్లో
ఆకాశం నిద్ర పోతుంది
చినుకు చినుకును
కూడేసుకుంటుంటే చెరువు
గారబాలకు పోయి
పైకెగిరి దూకుతున్నయి చేపలు
నిశ్శబ్దాన్ని బొమ్మకట్టే
గాంధర్వ తలమది
ప్రతి కదిలిక ఓవాయిద్యమై
వాగు రాగమై సాగే
తడక అడ్డం లేకుండనే
వెన్నెల తాన మాడిపోయింది
కలలు తిరిగిపోయే గలుమ
పెద్దగుండు బోర
రేలకొమ్మలు వొంగిన మూల
కోనేటి మూల
బంగారు తెడల రధం మీద
ఎండి చందమామలు ఏగిరొస్తున్నయి
మునిగిన గుడి
తేలిన భక్తి
పొద్దు ముద్దాడిన బుగ్గదొమ్మలు
నీలి చెవి చెమ్మలు
ఎవరు లేరప్పుడు
ప్రాణదూతలు ఉచ్చ్వాస నిశ్వాసలు తప్ప
కల్లు ఇడిసి
చాపలు వొలిసే
బెస్త పెద్దులు గౌండ్ల పెద్దిగోపాలు
కలిసిన కాలం కండ్లల్ల తిరిగే
చెరువులోకి తాడు వొంగితే
తాడును ముద్దాడింది చెరువు
యిద్దయ్య గండయ్య
ఆకు పడితే ఆటు పడుతది
రంగోల్ల లచ్చయ్య
రేక పడితే రాగమొస్తది
గౌండ్లాయిన బోరకు గలమే లేదు
తూర్పు బోరకు
తూర్పరా పట్టిన బతుకు
బోర బోరకు బోయిలున్నారు
పీత బాధపీతదే
పిత్తపరక బాధ పిత్త పరకదే
చాపలోలే దుఃఖం జెన యిడిసింది
ఎద భారం నీటిలోకి జారింది
ఒక దాని నుంచి ఒకటి
ఒకరి నుంచి ఒకరు
కిందినుండి పైకి
మధ్యలో దూరింది కాలం
వేడుకోలును వేడుక చేసుకుంది
బాధపడ్డ కాడికి బాధపడ్డం
ఏడికాయితే అడికేకాని అని
ఏక చిత్తం చెసుకోని ఉంటే
మళ్ళీ పాణాన్ని
దరి గుంజుతూనే ఉంది
ఇల్లు నెత్తుకోని తిరిగిన్నో
చెరువు నెత్తుకోని తిరిగిన్నో
చాపలు వలలో పడ్డయో లేదో గాని
కన్నీళ్లు చెరువులో పడ్డయి
ఆకలికి ఓ బోర ఆనందానికి ఓ బోర
బోర బోరకు బోయి కండ్లు మారే
ఆకలి ఆత్మల అలజడి
అడుగుల కింద మార్మికతోవ
బోరల బలగం తప్ప
నెనరున్న వాళ్లు ఎవరు
నెలవున్న వాళ్లు ఎవరు
ఎగిరొచ్చేవాళ్లు ఎవరు
ఎదురొచ్చే వాళ్లు ఎవరు
సారమేమి లేదు
సాట మీద సాలమ్మ
సెరిగినా గాలిచ్చినా వొడిపిల్లే
ఎంత ఎతికినా
తాకత్ లేని తారిఖులే
కాలం కత్తి కంటే పదును
అమ్మ లేని కలలు
కొనలేని నిజాలు
బుడుబుంగలా
మునిగి తేలుతున్నా
తేప తేపకో బతుకు.
- మునాసు వెంకట్
9948158163