Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసిపాప ఏడుపుకు తాళం వేసి
ముఖాన్ని పువ్వులా వికసింపచేసే
నిన్ను చూస్తుంటే
ఓదార్పుకు రూపమనిపించింది
ఏ సంగీత పాఠశాలలోనూ
పాఠాలు నేర్చుకోని నువ్వు
నీ ధ్వనితో
చంటి పాప మనసును మైమరిపిస్తవు
సప్త స్వరాలను పరిచయం చేసి
మరో తుంబురిడిని జ్ఞప్తికి తెస్తవు
చిట్టి పాపకు నీ పేరు తెలియదు
నీ ఊరు తెలియదు
పరిచయం లేకున్నా
పరవశానికి చిరునామావవుతవు
అమ్మ జోల పాటకు వాయిద్యానివై
బుజ్జాయి బోసి నవ్వుల జలపాతమవుతవు
నీకు కుల మతాలంటే తెలియదు
వర్గవైషమ్యాలు అసలే తెలియదు
సమ సమాజ భావనకు ఆచరణ పాఠమవుతవు
నీ గలగల మోతలతో
లోకం తెలియని బుజ్జాయికి
అమ్మ అగచాట్లను
నాన్న పాట్లను ఏకరువు పెట్టి
లక్ష్య నిర్దేశనం చేసే గురువవుతవు
ఎత్తింది గిలక్కాయ రూపమే కానీ
గిరగిర తిరిగే భూమి మీది మనుషులందరికీ
పరిచయ గీతానివి నీవు
తరాలు ఎన్ని మారినా
ప్రతి తరానికి సుపరిచితమైన నీవు చిరంజీవివి
- ఉప్పల పద్మ, 9959126682