Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివిధ సాహితీ సంస్థలు ప్రతి సంవత్సరం కథలకు సంబంధించి ప్రత్యేక కథా సంకలనాలు, కథావార్షికలు తీసుకొస్తున్నారు. సామాజిక స్పృహతో, ప్రాంతీయ స్పృహతో రాజకీయ, సాంస్కృతిక, ఆర్ధిక విషయాలను వస్తువులుగా తీసుకోవడమే గాక ప్రత్యేకంగా యువ రచయితలు తమ కొత్త ఆలోచనలను కూడా జోడించి కథా రచన సాగించడం ఆనందదాయకం. తెలుగు కథ రచయితల వేదిక పక్షాన సి.హెచ్.శివరామ ప్రసాద్ సంకలనకర్తగా 49 కథల సమాహారంగా వచ్చిన కథల సంకలనం 'మా కథలు - 2020'.
ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లబ్ద ప్రతిష్టులైన కథకుల రచనలున్నాయి. 'మనిషిలో నదులుం టాయా.. మనిషిలో అరణ్యాలుంటాయా.. మనిషిలో ఆకాశాలుం టాయా...' అంటూ ఒక తాత్విక నేపథ్యపు ఎత్తుగడతో సాగే రామచంద్ర మౌళి కథ ''ఇక్కడే'' మనిషిలోని ఒక ప్రపంచాన్ని దర్శింపజేస్తుంది. ఛత్తీస్‌ఘడ్, బస్తర్ జిల్లాలోని జగదల్పూర్, ఇంద్రావతి నది, చిత్రకూట జలపాతం ప్రస్తావన, ఉష అనే ప్రొఫెసర్ అడవి లోపలి జూలాఘాట్‌ను తన మూలగ్రామం చేసుకొని మూలవాసుల పరిరక్షణ కోసం పరితపిస్తూ శ్రమించే మహిళగా పాఠకుల మనసుపై ముద్రవేస్తుంది. కథావస్తువు, కథా గమనం పాఠకులను బస్తర్ అడవుల్లోకి లాక్కెళ్తుంది. బి.ఎస్.రాములు కథ 'కొత్త కోర్కెలు'లో 'సత్యంకు పెద్ద కోర్కెలంటూ లేవు..' అంటూ సాగుతూ మనిషిని ఎడతెరిపిలేని కోర్కెలు ఎలా ముట్టడి చేస్తాయో కథలో చూపుతారు. కథలోని సత్యం సమాజంలోని సగటు మనిషికి ప్రతీక. అంతులేని ఆశలకు కోర్కెలు జతచేసి సంపాదించినా ఒక్క చెడ్డ పేరు తప్ప ఏదీ అతని స్వంతం కాదు అన్న సత్యాన్ని తెలియజేస్తాడు కథకుడు. జీవితానుభవం తెలిసిన వ్యక్తి రాములు. సమాజంలోని ఒక 'కామన్‌మాన్' ను మన ముందుంచుతారు ఈ కథ ద్వారా.
లలితావర్మ కథలో కిరణ్ బాహ్య సౌందర్యా లకు ఆకర్షితుడయ్యే వ్యక్తి. అందంగా వుండే తన కాలేజ్ మేట్ మానసను వివాహం చేసుకుంటాడు. వీరి సహవిద్యార్థిని స్వాతి అందవికారంగా ఉండటం అలుసుగా తీసుకొని ఆమెను హేళనచేస్తూ తమ చర్య లతో అవమాన పరుస్తారు. కిరణ్, మానసలకు ఒక బాబు. అతను ఆటిజం వ్యాధితో బాధ పడటం, అతని వైద్యం కోసం కువైట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి డాక్టర్ను కలవడం చేస్తారు. ఇక్కడ వైద్యురాలిలా స్వాతి ఎదురుకావడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అక్కడ ఆమె ఆటిజంతో బాధపడే పిల్లలను చేరదీసి వారికి ఆదరణ, అనురాగంతో దగ్గరగా తీసుకొని సేవ చేయడం, అలాగే కిరణ్, మానసల బాబుకు కూడా నయం చేయగలనని చెప్పి భరోసా ఇవ్వడంతో వారిద్దరూ పాత సంఘటనలను గుర్తుకు తెచ్చుకొని వారిలోని సంకుచి తత్వానికి సిగ్గుపడడం, బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం, మానవత్వం, స్నేహగుణం, ప్రేమ గొప్ప వన్న వాస్తవాన్ని తెలుసుకుంటారు. అద్దం ముందు కూర్చుని చూసుకుంటున్న మానసకు తన లోపలి ప్రపంచంలోని కురూపితనాన్ని అద్దం చూపి స్తున్నదా? అన్న భావన కలుగుతుంది. ముస్లిం సాంప్రదా యాల నేపథ్యంలో సలీం రాసిన కథ' తెర'. ఇందులో ఆఫ్రీన్ అనే అమ్మాయి తన పెండ్లికి కొన్ని కండీషన్లు పెడుతుంది. అవి తనను పెండ్లి చేసుకునే యువకుడు తన మనోభావాలను గౌర వించాలని, సాంప్రదాయాలంటూ బురఖా వేసుకోమని ఒత్తిడి చేయకూడదనే నియమాలు పెడుతుంది. ఫలితంగా ఎన్నో పెండ్లి సంబంధాలు వెనక్కి వెళ్లిపోతాయి. చివరికి బషీర్ అనే యువకుడు ఒప్పుకోవడంతో అతనితో పెళ్లి నిశ్చయమవుతుంది. పెండ్లికి నాలుగు రోజుల ముందు కనీసం అవసరమైన ప్పుడు కొన్ని సందర్భాల్లో బురఖా వేసుకోవాలని బషీర్ వేడు కోగా అందుకు ఒప్పుకోకుండా నిశ్చయమైన పెండ్లిని కూడా వదులుకొని తనకు ఆత్మాభిమానం ముఖ్యమని, ఈ రోజు మాట ఇచ్చి తప్పినవాడు రేపు పెండ్లయ్యాక ఎలా ప్రవర్తి స్తాడో అంటూ సందేహాన్ని వెలిబుచ్చి పెండ్లిని క్యాన్సిల్ చేసుకోవడం ఈ కథ సారాంశం. 'ఇక్కడే బాగుంది' కథలో ర్యాంకుల తాపత్రయంలో తల్లిదండ్రులు పసిపిల్లలపై ఒత్తిడి తీసుకురావడం, వాటి పరిణామం ఎలా వుంటుందో శివరామ ప్రసాద్ (వాణిశ్రీ) చూపుతారు. సంకలనంలోని కథలన్నీ సామాజిక జీవితాల్లోని భిన్న పార్శ్వాలను చూపుతాయి. ప్రముఖ కథ, నాటక, సినిమా సంభాషణల రచయిత, దర్శకుకులైన పినిశెట్టి శ్రీ రామమూర్తి శత జయంతి సందర్భంగా వారి స్మరణలో ఈ సంకలనం అంకితమిచ్చారు. ఈ సంకలనం - కూతురు రాంరెడ్డి, సింహప్రసాద్, గన్నవరపు నరసింహమూర్తి, ప్రభాకర్ జైని, చంద్రశేఖర్ ఆజాద్, అంబల్ల జనార్దన్‌లతో పాటు ఇతర సీనియర్ కథా రచయిత్రులు, రచయితల కథలతో అలరా రుతోంది. కథల ఎన్నికపై శివరామ ప్రసాద్ తీసుకున్న శ్రద్ధ కనబడుతుంది. కథలన్నీ వర్తమాన సామాజిక పరిస్థితులను, కుటుంబ సంబంధాలను, మానవ సంబంధాలను చిత్రీకరిస్తాయి.
- డా.రూప్‌కుమార్ డబ్బీకార్, 9908840186