Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండు కవితా సంకలనాలతో శక్తిమంతుడయిన కవిగా గుర్తింపు తెచ్చుకున్న దేశరాజు రెండవ కథా సంకలనం 'షేమ్..షేమ్.. పప్పీ షేమ్!'. బ్రేకింగ్ న్యూజ్ పాఠకురాలిగా దేశరాజు కథా కౌశలం గురించి తెలుసు. కవిత్వం అంత పదునుగా కథ చెప్పడం కష్టం. కవిత్వం తాకినంత సూటిగా హృదయాన్ని కథ తాకడం కష్టం. అయితే రెండు ప్రక్రియలలోనూ నైపుణ్యం సాధించినవారు లేకపోలేదు. అలా కవిగా కథకుడిగా తనకొక స్థానాన్ని దేశరాజు సాధించగలడని అతను ఎన్నుకున్న వస్తువులు, చూసే చూపు తెలుపుతున్నాయి.
ఈ కథలలో నాస్టాల్జియా పలవరింత, అప్పుడదొక స్వర్గం అనే కాలయంత్ర ప్రయాణం; ఆదర్శాల ఆకాశయానం గంభీర ఉపన్యాసాల వరద లేవు. ఇది వర్తమాన సమాజ చిత్రపటం. రచయిత తరఫున, మనం ఎలా వుండాలో చెప్పే తీర్పులూ వుంటూన్న పరిస్థితిపై ఘాటు విమర్శలు లేవు. ''ఇలా వున్నాం కనుక ఎలా వుండాలో తేల్చుకోండి'' అని పాఠకుల వివేకాన్ని గౌరవిస్తాడు. అది మంచి లక్షణం.
వ్యక్తిత్వ నిర్మాణకాలంలో ఏర్పడి నిలిచిపోయిన ఆదర్శ చట్రంలో ఇమిడి వుండడం వలన సమాజానికి చేయగల మేలు, కాలం తెచ్చిన మార్పులకు అనుగుణం గా జీవించడం వలన ఏమాత్రం చెయ్యలేమా? మధ్యే మార్గం లేదా? ఎవరిమటుకు వారు తమతమ సుఖ సౌధాలకు అలవాటు పడినప్పుడు సమాజాన్ని పట్టించు కునేదెవరు? మనమటుకు మనం మన సిద్ధాంతాలను అనుసరించే జీవనశైలి ఏర్పరుచుకుని బతికినంత మాత్రాన సమాజానికి వొరిగేది ఏమిటి? మన ఆచరణ కనీసం కొందరికైనా మార్గదర్శకం కావాలి కానీ మనని చూసి మెచ్చుకుంటే చాలా? లేదా మనకి మనం నిజాయితీగా వున్నామనే ఆత్మ సంతప్తి చాలా? మారిన ప్రపంచ స్థితిగతుల వేగానికి కొట్టుకుపోకుండా నిలబడగల స్థిమితం ఎంత మందికి సాధ్యం? అరచేతిలోకొచ్చిన సాంకేతిక సౌకర్యాలు జీవిత గమనాన్ని సులభతరం చెయ్యడంతో పాటు అనేక చాపల్యాలకు దారి తియ్యడాన్ని నిలువరించడం సాధ్యమా?
ఇంటిపని స్త్రీలదే అనే సంప్రదాయం ఇంకా చెల్లుబడి అవుతూ వుండగా, ''ఉద్యోగం పురుష లక్షణం'' అనే నానుడిని ఆర్థిక స్థితిగతులు, స్త్రీల స్వాతంత్య్ర ఆకాంక్ష కలసి ''ఉద్యోగం మనిషి అవసరం''గా మార్చాయి. అయితే మనుషులందరికీ ఇంటాబయటా కనీస సౌకర్యాలు సమానంగా లేవు. ఇంట్లో శ్రమ విభజన సమానంగా లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని సహచరితో పని పంచుకునే పురుషులను ఎగతాళి చెయ్యడం విషయంలో స్త్రీలు కూడా మారకపోవడం ఆశ్చర్యం.
వయోభేదం లేకుండా స్త్రీలపై హత్యాచారాలు, ఆ విషయంలో సమాజం చేసే విక్టిమ్ బ్లేమింగ్ మనకి కొత్త కావు. ఈ భయానక బీభత్స స్థితి లో స్త్రీలే తమను తాము నిలబెట్టుకోడానికి సాంకేతికను ఉపయోగించుకోడం నేర్చుకోడమే కాదు, మగపిల్లల పెంపకంలో మార్పురావాలి. ఇదంతా జరగాలంటే కుటుంబ సభ్యుల మధ్య సంభాషణకి సమయం వుండాలి. అది వుండాలంటే బతుకులో స్థిమితం వుండాలి. అది వుండాలంటే ఆర్థిక వెసులుబాటు వుండాలి. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో ఇదెలా సాధ్యం? ఎప్పటికి సాధ్యం? ఎవరివల్ల సాధ్యం?
అన్నీ అమరిన అరచేతిలోకి వయసుతో సంబంధం లేకుండా సౌకర్యాలతో పాటు చాపల్యాలు కూడా తెస్తున్న సంకేతిక పరిజ్ఞానిదా తప్పు? దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేని మూర్ఖ మానవులదా? యువతతో ఆడుకుంటున్న స్వార్ధపరులదా? గంభీరమైన విషయాలతో పాటు హాస్యంతో కూడిన అవాస్తవ కథలు రెండింటితో పద్దెనిమిది కథల ఈ కదంబం సరళమైన శైలిలో వుండి చదివిస్తుంది, ఆలోచించమంటుంది.
- పి సత్యవతి