Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మసిబట్టిన అద్దమే వెలుగును మింగిన గ్రహణాన్ని స్పష్టంగా చూపుతుంది. మకిలిపట్టిన ఎవ్వరికీ అక్కర్లేని జీవితాలు సమాజ పోకడని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. బెంగాలీ జీవితాల్ని శరత్ టాగోర్‌లు పరిచయం చేసినప్పుడు ఈ మనుషులేమిటి ఇరుగు పొరుగునే వున్నట్టున్నారు అనిపించేది. ఉత్తరాంధ్ర సరిహద్దులతో మిళితమైన ఒరియా జీవితాలు అటు బెంగాలీ, ఇటు తెలుగు జీవితాల్లో మమేకమైనట్టు తోస్తాయి. గౌర హరిదాసు పరిచయం అక్కర్లేని కథకులు. జీవితంలో ఎదురయ్యే అతి సామాన్య విషయాలే వారి కథా వస్తువులు. ఆ సామాన్య విషయాలే కథలైపోతే ఎవరు రాసినా కథలు కావాలి కదా?
వంట సామాగ్రి అదే అయినా హస్తాన్ని బట్టి రుచి మారినట్టు, హరిదాసు చేతిలో అదేమిటో అతి సాధారణమైన జీవితాలు వెంటాడే కథలై పోతారు. శరత్ చంద్రుడి పాత్రల్లాగే ప్రణాళికలేమీ లేకుండా వెళ్ళిపోతారు. టాగోర్ కథలో ముగింపుకు నడిపే ఒక కరుణా పూరిత ఆర్ధ్రత అంతర్లీనంగా ద్యోతకమైనట్టు శరత్‌బాబు కథల్లో కనబడదు. గౌర హరిదాసు కథల్లోనూ అదే ప్రవృత్తి కనబడుతుంది.
ఇంటికొచ్చే ఎందరో మామయ్యలకు ప్రతీక బాటా మామయ్య. మామయ్యలతో మన నాస్టాల్జిక్ మెమరీజ్ మనని ఆ రోజుల్లోకి తీసుకెళుతుంది. చిన్నప్పటి గాజు బొమ్మ లాంటి స్మృతి, పూర్తిగా తలకిందులుగా అసిమిలెట్ కానంత తీవ్రంగా గాజు పెంకులై సలిపే సందర్భం వచ్చినప్పుడు అదెంత బాధాకరమో ''గాజు బొమ్మ'' కథ చెబుతుంది.
తండ్రీ కొడుకుల మధ్య వుండే వ్యక్తం చేయలేని అనుబంధం గురించి చెప్పే సంఘటనని ఎంతో అద్భుతంగా చెబుతారీ కథలో. తన ప్రతీ అవసరాన్నీ తన మనసులోకి రాకముందే పసిగట్టి అమర్చిపెట్టిన నాన్న చిన్నప్పటి హీరో స్థాయి నుంచి క్రమంగా మన అభిప్రాయాల్ని గౌరవించలేని విలన్‌గా, మంచాన పడ్డాక వేస్ట్ మేనేజ్మెంట్‌గా అనుకోనూ లేక, అలా అని వర్దీ టు బీ లివ్డ్ గా భావించుకోనూ లేక, సడన్‌గా ''త్వరగా కాలం చేస్తే బావుండు'' కదా అనే పరిస్థితి ఎందుకొస్తుంది అనేది ఎవరికీ తెలియదు. దీస్ థింగ్స్ హాపెన్! అనుకునే భావన ఎలావుంటుందో ''తండ్రి'' కథ చెబుతుంది. అదే సమయంలో ''ఇల్లు'' కథ కూడా పట్టణ సంస్కృతిలో ఉద్యోగాలు చేసే కొడుకులు ఇంటి కోసం తండ్రి పడే తాపత్రయాన్ని ఎలా తీసుకుంటారో భలేగా చెప్పారు. ''పాపం'' కధా, ''కసింద చెట్టూ'' విక్టర్ హ్యూగో లే మిసరబిల్స్‌లో జీన్ వాల్ జీన్‌ని వెంటాడిన గిల్టీ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. చెమీ బౌరానీ జీవితం గుండెల్ని పిండేస్తుంది.
''అహల్య పెళ్లి'' లో భూస్వామ్య వ్యవస్థకు సంబంధించిన ఒక అనాచారాన్ని తన అవసరం కోసం బతికించుకొనే నైత్యాన్ని ఆధునిక ప్రపంచం కూడా ఎలా కొనసాగిస్తూ వస్తోందో ఇందులో హృదయ విదారకంగా చూపారు. ఒక అనాధ పిల్లగా వచ్చిన అహల్య ఇంట్లో అందరికీ పెండ్లిండ్లు కాగానే నీకూ చేస్తాం అని నమ్మించుతూ గొడ్డు చాకిరీ చేయించుకుంటూ వుంటారు అహల్యతో. ఆ ఇంటి చివరి పెండ్లి కూడా అయ్యాక ఇంక తనకి ఎవర్నో ఒకర్ని తెచ్చి ముడి వేస్తారులే అనుకుని కలల్లో తేలిపోయే ఆ పిచ్చి తల్లికి సారెతో పాటూ తననీ సరకు చేసి బండి ఎక్కించినప్పుడు ఆ హృదయం ప్రిదిలి పోతుంది.
''బంగారపు ముక్క'' అమ్మ హృదయాన్ని ఆవిష్కరించే కథ. ''ఏకు మేకు'' కథలోని నకుల్ నాయక్ నీ, అతని మరగుజ్జు మనస్తత్వాన్ని చూపినప్పుడు ఇలాంటి మన పొరుగున వున్న నకుల్ నాయక్‌ని ఈయన ఎప్పుడు చూశారబ్బా అనిపిస్తుంది.
సూక్ష్మంలో మోక్షమన్నట్టు ఒక చిన్న కథా కాన్వాస్ పై ఒక మానవ జీవితం తాలూకూ రంగు రంగుల రాగ ద్వేషాల నీడల్ని ఇంత ప్రతిభావంతంగా ఆవిష్కరించడం మామూలు విషయమేమీ కాదు. పట్టుమని పన్నెండైనా లేని ఈ కథా సంపుటిలో తారసిల్లే రంజులు అమ్మలు, నాన్నలు, మామయ్యలను చూట్టానికి ఒరియా వెళ్లాల్సిన అవసరంలేదు. వాళ్ళు మనింట్లో, మహా అయితే మన పొరుగింట్లో వుంటారు.
బడుగు బతుకుల జీవిత చిత్రాలు ఎక్కడైనా ఒక్కటే. ఇంక అనువాదం చేసిన కె.వి.వి.ఎస్.మూర్తి అనేక ఆంగ్ల రచనల్ని పాఠ కలోకానికి చేరువచేసిన పరిచయం అక్కరలేని అనువాదకులు, స్వయంగా కథకులు. ఒరియా సంస్కృతితో పెనవేసుకుపోయిన బాంధవ్యం ఈనాటిది కాదు. ఒరియా పేర్లు ఒకటో రెండో వచ్చి నప్పుడు తప్ప ఇది అనువాదమా అని ఆశ్చర్యపోయేలా చేశారు.
పొరుగున వుండే గొప్ప కథకుడ్ని తెలుగు వారికి పరిచయం చేసిన మూర్తి అభినందనీయులు.
- వి.విజయ్‌కుమార్