Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొట్టేడ పైడితల్లి సుట్టతాగీది
పైడితల్లి పెనిమిటి అచ్చియ్యా సుట్ట తాగోడు
ఈదిఈదంతా సుట్టతాగీది
సలికాలమొత్తె సుట్టే మా వూరిల బడిన
సలిపులిని పొలిమేరలకు తగిలీసె దివిటీ
శంబాన కొండయ్య సుట్ట తాగోడు
కొండయ్య సిరప నర్సమ్మా గుప్పుగుప్పుమని
సుట్టని ఎగబీల్సీది
సుట్టనేపోతె పనెలగ యెత్తిరిల్లీది అని
అనీది
పైడితల్లి అచ్చియ్య కొండయ్య నర్సమ్మ
మా తూరుపు కొమ్మకి పూసిన మట్టిపువ్వులు
మా సెవులిరకనో మా యేలిమజ్జలనో
మా పంచీల మడతలోనో సుట్ట సక్కగ
నిమారుగా అమిరీది
తాతలముత్తాతల కాంచి సుట్టతో మాది
మాగనమైన నేస్తరికం
సెరువుకి దొడ్డికిపొయెటేల సుట్టే మా మందు
ఎగువికి మేకలని తోలుకుపొయేటేల సుట్టే
మా జట్టు
నలుగురు కూడిన మజ్జలో సుట్టపొగొదిలితె
ఆ దరిజా ఆ దరపమూ యేరయా
సుట్ట పేనితె మా బాసిని అప్పయ్యే పేనాలి
సుట్ట తాగితే మా ఇసరాపు తాతే తాగాలి
అని మావూరిల నానుడి
కమ్మకత్తంచులాటి మంచి నిగనిగల మజ్జానం
కొండనిడిసి ఎండలబడి నెత్తిన కట్టెల మోకుతో
వొత్తున్న అప్పయ్య మూతిలో ముచ్చటగా
ఇమిడిన సుట్ట దారి దారంతా ఈవలి దీర్సిన ఆకుముంత
బారికిఅప్పన్న జులపాలజుత్తుని యెనక సిగగట్టి
బుగ్గలు నొట్టలుపడేల గుప్పుగుప్పుమని సుట్టని
పీర్సిపీర్సి వొగిల్తె సుట్టే మా గట్టుకి అందంచందం
అని వొప్పుకునితీరాల
సేపాని తమ్మయ్య అడ్డపొగేత్తే ఏ అడ్డసుడోడైన
మా ముందు దిగదుడుపే అనాల
ఇల్లెరక్క వొల్లెరక్క పొద్దల్ల అలిసిసొలిసి
పొద్దోయికి నీడకి జేరిన ఎద్దులబండిలా
కునుకోల అప్పలసోమి
సోమి నులకమంచం వుయ్యాలల సేరబడి
గొయ్యిల గొయ్యిల ఆకసాన్ని యెటకరిత్తూ
పంచి మడతల్లో దాగిన సుట్ట మొడుంని తీసి
యెలిగిచ్చుకుని సెలియో సెల్లకో పాడితె
దిక్కులు గుండెలదిరి తుపుక్కుతుపుక్కుమని
వూసికునీవి
ఇగనప్పుడు
ఈదిఈదంతా నవ్వుల పూల దండలల్లీది
సుట్టనేపోతే మాతరం మావోల వొంటికి
ఊష్టమొచ్చీది
సుట్ట కాల్సకపోతె మావోల పేనాలు సుట్టికునీవి
గంపడుపని వొక్కతూపులో అవగొట్టె మావోలికి
సుట్ట ఆదరువుగాపోతె దినందీరీది గాదు
సుట్టనేపోతే మా బతుకు సప్పబారీది
సుట్టకాడికొచ్చీసరికి సుట్టరికాలే తెగీవి
సుట్ట మా ఓదారుపు సుట్ట మా సెయ్యి సేరుపు
ఏ దేశిమేగిన ఎవ్వులేమనిన సుట్ట మావోల
కొండగురుతు
సుట్టని పీర్సీ పీర్సీ పేనాలైన ఇడుత్తాం గాని
సుట్ట తాగిన మావోలిని చీ.. పో.. అంతే వొల్లకోం
సూరీడు మా సుట్ట సివరే కూకోవాలి
సందురూడు మా సుట్టనీడల ఎదగాలి
- బాలసుధాకర్, 9676493680