Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ కన్నీళ్లను
సెలయేళ్ళు
దోసిల్లు నింపుకొన్నాయి
ఆ గాయాలను
కొండాలూ కోనలు
ఒంటినిండా అల్లుకున్నాయి
ఆ మనసులను
నరాలు బిగబట్టి చెట్లు
గుండెలకు హత్తుకున్నాయి
వెలుగుపూల
సూర్యచంద్రుల నిస్సహాయ సిగ్గుతో
ఆర్తనాదాడవి
చీకటయ్యింది
ఆ ఊపిర్లకు
వెదురు వనాల గానం
నీడ నెత్తింది
కాలం
తిరిగీ తిరిగి
కాళ్ళు బొబ్బలెక్కాక
తినితాగే ఊరి పెద్ద మనుషుల తీర్పయింది
పురుషాహంకారం గాయపడకుండా
రూపాయితో
లైంగికదాడి ముఖాన్ని
వికృతంగా అలంకరించారు
పొడిసిన పొద్దును
అసహ్యంగా
శుక్రకణాల అలికేసిన
పారామిల్ట్రీ పురుషాంగాల
ముందు
జనజీవన స్రవంతి ధర్మ దేవత
కళ్ళింకా
గట్టిగా మూసుకుంది
ఆ అడవి మనుషులు
కమ్మ బిడ్డలుగారు
ఆ అడవి మనుషులు
రెడ్డి బిడ్డలుగారు
ఆ అడవి మనుషులు
ఎలమ బిడ్డలుగారు
ఆ అడవి మనుషులు
బ్రాహ్మణ పుత్రికలుగారు
వాళ్ళు
కోన్ కిస్కా కోయోల్లు
అడవిలో
తెంపేసిన ఆకులు
విరిచేసిన
కొమ్మలు
కోసేసిన
మొగ్గలు వాళ్ళు
చీరేసిన
పువ్వులు వాళ్ళు
అంతే
న్యాయం
అరణ్య రోదన
యుద్ధ గానమైయ్యింది
- వడ్డెబోయిన శ్రీనివాస్