Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న రెండు జేబులను తోడి
పూటకు సరుకులు సంచి సగం నిండ కుండా
అమ్మ ఇచ్చిన లిస్ట్ ను కావాలని మరచి పోయి
షావుకారు పాత బాకీ అడిగే లోపున బయట పడి
బాద్యత ను తిరిగి అమ్మ భుజానికి తగిలించాడు
అమ్మ పొయ్యితో ముచ్చట చేసి
నువ్వు నేను మనసు పలచన చేసుకుని
ఈ పూట నలుగురి కడుపు నింపాలని
పిండి వంటలు వాయిదా వేసి
రెక్కలు సహకరించ లేదని పిల్లలకు అబద్ధం చెప్పి
కళ్లు తుడుచుకుని కంచాలను పిల్లల ముందుకు తోసింది
మాకేమీ తెలియనట్టు ఆకలే అవనట్లు
సగం తిని పూట సగానికి కోత పెట్టి
నాన్న ని గెలిపించాలని కడుపులో నీళ్లు నింపాం
పడుకునే ముందు తినడం ఎందుకని
రేపటికి పోపు అన్నంకు కేటాయించాం
అమ్మకో పూట పరీక్ష తగ్గినట్లు చేశాం
ఈ పూట గడిస్తే చాలు
నీతి అయోగ్ లాగా
పెద్ద పెద్ద ప్రణాళికలు వుండవు
రూపాయి రాక పోకల మద్య
కాగ్ దొరక బట్టెంత
చిన్న చిన్న తేడాలు కూడా వుండవు
మిగిలింది శేషమే మా బతుకులు సశమమే...
- దాసరి మోహన్, 9985309080