Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయాణాలన్నీ
అవసరం కోసమేనా?
మనిషి పుర్సత్ దొరికినప్పుడల్లా
నదిలా నాల్గు చెరగులూ ప్రవహించాలి!
పరిధిలోనే పరిభ్రమిస్తావా?
నీవు ఆముదం చెట్టుకో
విస్తరించిన బోధి వృక్షానివో
నీకెన్నటికీ ఓ పట్టాన అర్థం కాదు!
పర్యటనలెప్పుడైనా
సహజ విజ్ఞాన సర్వస్వాలే!
గౌతముడు గడప దాటనిదే
బోధి సత్వుడు కాలేదు
అనంతమైన దు:ఖపు మూలాలు
అన్వేషణలో బయటపడ్డవే!
అడవుల్లో తిరుగాడిన
పాండవుల అపార అనుభవాలు
హస్తినలో తిష్ట వేసిన
కౌరవులకెట్లా అర్థమవుతాయి?
కోల్పోవడం ఏదైనా
మోయలేని దు:ఖ భారమేమి కాదు
నీ నుండి నీలోకి
పయనించే కొత్త సందర్భమది!
సంచార తత్త్వం ఒంటబట్టకనే
మనిషి అయిన దానికి కాని దానికి
తొడలు చరుస్తున్నడు
మీసాలు మెలేస్తున్నడు!!
- కోట్ల వెంకటేశ్వరరెడ్డి, 9440233261