Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొన్నచేన్ల మీంచి చిలుకల గుంపులు
వరి గొలుసుల జెండాలతో చెలుకలు దాటినయి
రహదారి పొడుగూతా వ్యవసాయ పాదముద్రలు
నాసిక్ నుంచి ముంబయి దాకా
గోదావరిలా వరదల పరుగులు
ఎక్స్‌ప్రెస్ హైవే కదిలే మోదుగువనం
నెత్తిన టోపీలు చేతిల జెండాల రెపరెపలు
కై గట్టి కదులుతున్న పాదాలు
ఆరు రోజులు ఇన్నూరు మైళ్ళ ప్రయాణం
మునుం పట్టిన కొడవండ్లు
'శేత్కారి కర్జా మాఫ్ కేలే జావే'
'ఆత్మహత్యా ఆసు నఏ'
'పీకాసి కిమ్మత్ ద్యావే'
హామీల అమలుకే ఊరేగింపులు
అవి బురుద పొలం దున్నిన కాళ్ళు
ఎద్దూ ఎవుసం సుట్టు తిరిగిన అరికాళ్ళు
దుబ్బ చెల్కల నడిచిన పాదాలు
కొయ్యకాలు గుచ్చుకున్న అడుగులు
ఊరూరి దుక్కం ఒక్కటై పారిన
మరాఠా రైతాంగపు మర్లపడ్డ పౌరుషం
ఉరితాళ్ళు తరుముతున్న చప్పుడు
మదికట్లల్ల రాలిపోయిన గరుక పోసలు
నీళ్ళు లేని కాలువల్ల కన్నీళ్ళ తడి
సుతి మెత్తని షూస్‌తో నడిచే
పాదయాత్రల పటాటోపం కాదది
చెప్పుల్లేని అరికాళ్ళ సలపరింత
పొక్కులు పొక్కులై కారుతున్న నెత్తురు
గాయలై స్రవిస్తున్న హృదయాలు
కాళ్ళ ఏళ్లకు ఎన్ని పోట్రవుతుల దెబ్బలు
అరిపాదం మీద మంగ ముల్లు నొప్పి
కదులుతున్న కాళ్ళకు నీల్లిచ్చిన పల్లెలు
నడుస్తున్న అన్నదాతలకు
దండం పెట్టిన వూర్లు
కంఠ ఘోషలకు అందిన
ప్రాణ వాయువులు
మలబారు పోరు మదిల మెదిలి
తెలంగాణా రైతాంగ ఉద్యమం
హృదిన కదిలింది
పొలాల నుంచి దండెత్తిన
ముక్త కంఠ హలాలు
ఇది భూమి పుత్రుల మహా పాదయాత్ర
- - అన్నవరం దేవేందర్
కవి సెల్ : 9440763479