Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన నీకు అపరిచితుడే కావచ్చు
అక్షరాల సముద్రమై నిన్ను ఆవహిస్తాడు
ఆటు పోటులతో కల్లోలం సృష్టిస్తాడు
అలల సవ్వడిలా జోలపాట పాడేస్తాడు
నిర్మలంగా వుంటాడనుకోకు
నిలువెత్తు కెరటమై లేస్తాడు
నిరాడంబరంగానే వుంటాడు
కానీ.. నిజాన్ని నినదిస్తాడు
సమస్తం ఆయన వస్తువు
సమాజం ఆయన దుస్తువు
కప్పేసుకుంటాడు కవ్వించుకుంటాడు
దిగంబరమవుతాడు దివిటీ అవుతాడు
శివమెత్తుతాడు శిఖరమవుతాడు
క్షీరసాగర మథనమవుతాడు
ఆర్తారావమై గోలపెడతాడు
ఆలోచనల్ని ఆకాశంలోకి విసిరి
భూమ్మీద అక్షరాలు చల్లేస్తాడు
కలుపు మొక్కల్ని కావ్యాలతో పీకేస్తాడు
కలాలను హలాలుగా చేసి దున్నేస్తాడు
చూపుల్ని చురకత్తులు చేసి సూర్యోదయమై పొడుస్తుంటాడు
కాయాన్ని చిలుక్కొయ్యకు తగిలిస్తాడు
కలంలోకి పరకాయం చేసేస్తాడు
ఆయన హృదిలో వర్ణమాల
ఆయన మదిలో స్వర్ణమాల
గూళ్లు కట్టుకుంటాయి.. కథలు కథలుగా
సమాజంపై బ్రతుకు చిత్రమవుతాడు
మనసున్న మహారాజతడు
జీవిస్తూ జీవిస్తూ.. కథలా కదిలిపోయాడు
శ్వాసిస్తూ శ్వాసిస్తూ.. జన వ్యథలా జీవిస్తూనే వుంటాడు
ఆయన అక్షరం కదా..!
(మా మాస్టారు.. ప్రముఖ కథారచయిత
'జాతశ్రీ'కి అక్షరాంజలి)
- కటుకోఝ్వల రమేష్, 9949083327