Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బహుజనులారా
మీ ఓటెవరికి?
ఇది ఎన్నికల వసంతం
కాకులు కోకిలలు నల్లగానే వుంటాయి
వాటి కూతలు మాత్రం వేరుగా వుంటాయి
ప్రాబల్య వర్గాలేవో
బహుజను లెవరో
కూతను బట్టి మనం పసిగట్టవచ్చు!
మీకు ఆకలవుతే
అడుక్క తినాలా?
మీకు రోజూ ఆకలవుతది
మీరేమైనా కుక్కలూ, కాకులా
ఇతరులు పెట్టే పిండాలు, ఎంగిలి మెతుకులు తినడానికి!
పలుగు మీది
పార మీది
ఇతరుల భూములు దున్నేది మీరు
అవి మీవేనని మీరెందుకనుకోరు?
రాళ్ళెత్తేది మీరు
భవనాలు కట్టేది మీరు
మయసభలు నిర్మించేది మీరు
మోస పోయేది మీరు
ఎవడో డబుల్ బెడ్రూం ఇండ్లు
కట్టి మీకెందు కివ్వాలి?
నీ ఇల్లు నీవు కట్టుకోలేవా
నీ బువ్వ నీవు తినలేవా?
బడుగులు బలహీనులు
దళితులు ఆదివాసీలు
అల్పసంఖ్యాకులు
ఆడవాళ్ళు అంటరానివాళ్ళు
అణచి వేయబడినవాళ్ళు
అధికారానికి దూరమైన వాళ్ళు
దరిద్రాన్ని అజ్ఞానాన్ని
వారసత్వంగా పొందేవాళ్ళు
ఏకంకండి? పోయేదేముంది?
ఓట్లు మీవి, సీట్లు మీవి
రాజ్యం బహుజనులదే!
చెట్టు మట్టిలో పుడ్తది
మౌనంగా ఎదగాలని చెప్తరు
ఎందుకు?
దానికి మనిషిలా
పంచేంద్రియాలు లేవు
అది ఆకలైనోనికి పండ్లిస్తది
అలిసొచ్చినోనికి నీడనిస్తది
ఎండకు ఎండుతది
వానకు తడుస్తది
ఎవడో ఒకడొచ్చి దాన్ని నరుకతడు
చెట్టుకు చేతుల్లాంటి
కొమ్మలున్నా చేతులెత్తదది
నీవూ అంతేనా?
నీ చేతికి వేళ్ళున్నాయి
నీ కళ్ళు నీవు పొడుచుకోవడానికేనా?
నీకు కండబలం వున్నది
గుండెబలం లేదా?
స్పందించడానికి హృదయం వుంది
ఆలోచించడానికి మెదడు లేదా?
మీ చేతిలో
వజ్రాయుధం లాంటి ఓటున్నది
మిమ్మల్ని తొక్కేవాళ్ళని
మౌనంగా భుజాలకెత్తు కోవడానికా?
బహుజనులారా!
ఇప్పుడు చెప్పండి
మీ ఓటెవరికి?
బాబాసాహెబ్, ఫూలే
జెండాలు మోసేవారు
మీరెటు వైపో ఆలోచించండి
పీడిత తాడిత ప్రజల పక్షమా
ప్రాబల్య వర్గాల పాలకుల వైపా?
తల వొంచు కుంటావో
తలెత్తుకొని నిల్చొని
బహుజన రాజ్యానికి జై కొడ్తావో
నీ యిష్టం!
- జలజం సత్యనారాయణ,
9849444944