Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా భాష తెలుగు భాష
నా శ్వాస - తెలంగాణ యాస
మనిషికి భాషే ప్రాణం
భాషకు యాసే ప్రాణం
గాధాసప్తసతికి తెలగాణ మాటే మూలం
బాధాతప్తహృదికి తెలగాణ పాటే ఉపశమనం
కాకతీయుల కాలంలో కాకలు తీరిన భాష
విద్యారణ్యుల వైవిధ్య భావసంపన్నం
ఓరుగల్లున తిక్కన కభయ మిచ్చిన భాష
పాల్కురికి సోమన్న హృదిలో మొల్చిన భాష
సోమన్న ద్విపదలు శంభుని మకుట భూషణాలు
బమ్మెర గ్రామాన పోతన్న రాసిన భాష
రామప్ప గుడిలోని బొమ్మ చెప్పిన భాష
చరిగొండ ధర్మన్న చిత్రికపట్టిన భాష
కొమరం భీమయ్య గుండెనిండిన భాష
చాకలి ఐలమ్మ పౌరుషాగ్ని రగిలించిన భాష
కాళోజి కలమందు కదనుతొక్కిన భాష
గోరటెంకన్న గళానపదునెక్కిన భాష
ఏలలు, రగడలు, యక్షగానాల
పరిఢవిల్లిన భాష
రేలపాటలలోన మేళవించిన భాష
ఆదిలాబాదు నుండి బాదలాపురం దాక
విస్తరించి ఓలలాడించిన నా భాష
కొండకోనల నుండి వాగు వంకల వరకు
మెండైన భావాల పూలతోటయ్య నా భాష
నా భాష తెలుగు భాష
నా శ్వాస తెలంగాణ యాస.
- తాటికొండాల నరసింహారావు,
9885787250