Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిగులుపడ్డ పడ్డ మనసుకు కన్నీరైన గుండెకు కూలబడ్డ హృదయానికి కవిత్వమో దేవాలయం. అక్షరాలను కవితలు చేసి అలంకరిస్తాడు కవి. ఎంచుకున్న వస్తువు నిర్మాణ క్రమం వెలుగురేఖల్ని ప్రసరిస్తాయి. రవివర్మ కుంచెలా కవికలం కలకాలం నిలిచే కవితలకు ప్రాణం పోస్తుంది. చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ప్రతిభ. కవిత్వమో నిరంతర జ్వలనం ప్రసాదమూర్తి గారికి. కదిలించిన ప్రతి సందర్భాన్నీ కవిత్వీకరించటం కవికి కొత్త విషయమేమీకాదు కానీ ఆ క్రమంలో శషభిషలు లేకుండా సూటిగా గుండెల్లో గుడిగంట మోగినట్టు చెప్పే ఒడుపు తెలిసిన కవి ప్రసాదమూర్తి.
ఇటీవలే వారు వెలువరించిన కొత్త కవితా సంపుటి, దేశంలేని ప్రజలు ఆ విషయాన్ని స్పష్టీకరిస్తుంది. డెబ్భై రెండు ఖండికలు పఠితను పండు వెన్నెల్లా పలకరిస్తాయి. కల్లోల గోదారిలా కుదిపేస్తాయి. తొలిపొద్దు కిరణంలా వెలుగులు పంచుతాయి. ఎంచుకున్న వస్తువును మృదువైన శిల్పంగా మలిచే మనోహర శిల్పి ప్రసాదమూర్తి. బాధను అనుభవించటమేకాదు బట్వాడా చేయటం తెలిసిన స్వాప్నికుడు. ప్రతీకలు తూనికేసినట్టు తూగుతాయి.అక్షరాలు విరబూస్తాయి. పద్యం వెన్నెలై విరగకాస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
కొన్నింటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. 'వాస్తుశిల్పి' కవితలో తనకో విశాల దృక్పథాన్నిచ్చిన తల్లిని ఎలా తలుచుకుంటారో చూడండి. ''కన్నీళ్ళు ప్రవహిస్తాయి.../ కత్తులు లోపలికొచ్చి పూలగుత్తులవుతాయి/ అదేమిటో ఎటు తిరిగినా నాకు సూర్యుడూ చంద్రుడే కనపడతారు/
ఏమైనా ఈ ఇంటిని అన్నికాలాల్లోను/ అన్ని వైపులా తెరిచి ఉండేలా కట్టిన/ మా అమ్మ నిజంగా గొప్ప వాస్తు శిల్పి/ అంటారు.. తనను తీర్చిదిద్దిన తల్లికి కవి సమర్పించిన కైమోడ్పుల కవిత అది.
ఈ కవికి తనను లాగేసిన అంశమేదైనా పద్యమే. తనతో తాను యుద్ధంచేసి మరీ భావాలకు భవభూతిలా పదబంధాల కానుకిస్తాడు. అది హక్కుల హరింపుపై నిరసన అయినా శీతాకాలపు మంచు వలయినా వలేసి పదాలను అక్షరాల సముద్రంలోంచి ఏరతాడు. 'మంచువల' అనే ఖండికలో రాత్రి అల్లిన మంచు వలను సూర్యుడు లాగటాన్ని ఊరంతా చూపిస్తాడు కవి.
పచ్చిపచ్చి కిరణాలను/ గుళ్ళమీదా ఇళ్ళమీదా దులపరిస్తూ/ అని మొదలు పెట్టి పొలాల మీదుగా ఊరి మీదుగా చెరువుల మీదగా/ వలనులాక్కుంటూ వచ్చి/ ఊరవతల వెలివాడలో కూలబడతాడు/ బహిష్కృత స్మృతుల బ్రహ్మజెముడు పొదలకు చిక్కుకున్న/ వలను లాగలేక ఇనుడు ఖిన్నుడవుతాడు/ అని కొంచెం ముందుకు వెళ్ళి మనల్ని, మన మనసుల్ని అక్కడ నిలబెట్టేస్తాడు. ఊరంతా తిరిగిన కవి దాచుకున్న స్మృతుల చెమ్మ అది..
ఇక మకుట పద్యం దేశం లేని ప్రజలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కవిని కుదిపేయగా బాధ పరుచుకున్న పద్యం మనముందు మోకరిల్లు తుంది.. బాధను వ్యక్తం చేయడంలో ఈ కవి సందేహపడడు. కలవరపడతాడు.
కళవళపడతాడు.. నిప్పులో ముంచిన అక్షరాలను పదాలుగా వెలికితీస్తాడు.దేహాలను దేశాలకవతల గుడారాలుగా పాతుకుంటున్న/ కాందిశీకుల కళ్ళలో కత్తులు పూస్తున్న కాలం గురించి మాట్లాడాలి/ అంటాడు
దృశ్యాన్ని చూపిస్తూ/ దేశాలిప్పుడు డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నాయి/ అని వాపోతాడు. మనుషుల మధ్య ఇనప తెరలు దేశాల మధ్య ఇనప తెరలు దేశంలేని ప్రజల చితిని పేరుస్తున్నాయని చింతిస్తూ ''దేశంలేని ప్రజలే నా కలల తీరంనిండా''అని కన్నీటి సమూహాల హాహాకారాలతో నివాళి సమర్పిస్తారు.
ఈ కవికి తన ఊరంటే ఇష్టం. ఊరు వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతిని పద్యంగా చిలకరిస్తారు. ధ్వంసమైన ఊరి చెరువును చూసి కవి గుండె చెరువవ్వగా జాలువారిన వాక్యాలు చూడండి పచ్చదనాన్ని ఊడ్చిపారేయడానికి/ రొయ్యలూ చేపలు కొత్త పారలు మోసుకొచ్చాయి/ అంటూ తనకంతా తారుమారుగా ఉంది అని నిరాశ వ్యక్తపరుస్తారు.... అలా అని ప్రతిసారీ నిరాశే ఉంటుందనుకోకండి.
''లేతవరిమొక్కలు పద్యం కూడా ఆయన ఊరువెళ్ళినప్పుడే అనుభూతిగా వెలువడ్డదే. చుట్టమొచ్చాడని పలకరింపుగా/ చుట్టూ పంట చేలలో లేత వరి మొక్కలు/ కొత్త కవితలై తలలు పైకెత్తి నవ్వినట్టు'' అని సమాధానపడతాడు.
కవికి కాలస్పృహ ఉండాలంటారు. కవి ప్రసాదమూర్తి తన కవితలద్వారా.. స్టీఫెన్ హాకింగ్ స్మృతులను పరిచయం చేస్తూ ''కాలం కాగితం మీద జ్ఞాన దీపాలు లిఖిస్తూ/ ఏ గహనాంబరాల గవేషణలోనే/ తుది ప్రయాణంలో అతను'' అంటారు కవి..
కాస్ట్రో,సాహిర్ లూథియాన్వీ,గౌరీ లంకేష్ జ్ఞాపకాల స్మృతులను తవ్విపోస్తారు.
అన్ని కవితల్లోను తాత్వికధార ఒదుగుతూ ఆకట్టుకుంటుంది. వస్తువుకు తగ్గ భావోద్వేగాలతో కవితలతో దీపకాంతులై వెలుగుతుంటాయి. అన్ని కవితల్లోనూ చివరి వాక్యం చీల్చే కత్తిలా పదునెక్కి ఉంటుంది. ఏమాత్రం గందరగోళం చోటుచేసుకోని కవితలన్నీ మనిషి రీతికి లోకభీతికి నిదర్శనంగా నిలుస్తాయి. కవి వాదానికి మనం కట్టుబడకపోవచ్చు కానీ కవి తన వాదనను కొనసాగించిన తీరు ముచ్చటేస్తుంది. పందిరేసి అల్లినట్టున్న పదాల పొందిక జీవితంలోని తీపిని చేదును పరిచయం చేస్తూ మనిషిగా మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. ఆలోచింపచేసే ముఖచిత్రం.. ఆకట్టుకునే శీర్షికలు... దేశంలేని ప్రజలు కవితా సంపుటి కవిత్వాన్నెందుకు పలవరించాలో సున్నితంగా పలకరించాలో సునిశితంగా చెప్పే కావ్యం.
- సి.యస్.రాంబాబు,
సెల్ : 94904 01005