Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిషిద్ధాక్షర పద్యంలో
ఒక లెక్కించిన గళ్ళలో
సూత్రప్రాయ జీవనం
కలవని రెండు
సరళరేఖలు
ప్రాసయతుల ప్రస్తావనలు
అసంకల్పిత కల్పిత చర్యలు
భావవిన్యాస క్షేత్రంలో
కొన్ని బలంగా గీరుకుపోయిన చిత్రాలు
తుడిచిపెట్టుకు పోయినవని
తిరిగిరాని కాలానివనీ....
తిమిర వ్యాకరణ సిద్ధాంతం!
చంధోబద్ద పద్యంలో
తెగిపోయి
తేలిపోయిన భావుకతలై
రాలుతున్న ఆశల చుక్కలు
కొన్నిసార్లు
మనసు
తెల్లని ఖాళీ మబ్బులు నింపుకొని
ఖండన బిందువుల కఠిన పలకరింపులు విడిచి
ఓ సంగమ శిఖర తలాన
లోయల ఉనికి మరిచి
పీఠభూమి స్థితిలో
సరిపెట్టబడిన సమయం
శాశ్వత దశ్యమని
క్షణకాలపు భ్రమ!
అలంకారాల్లో ఉదహరించిన
ముఖం...చంద్రబింబంలా ....
నిజం తెలిసిన అతిశయ భాషలో
చేదు సత్యమైన
మళ్ళీ పేరుకుపోయిన
విశాల వైశాల్యం లేని వత్త రచనలోకి నెట్టివేసి మేల్కొలుపుతుంది
కొన్నిటిని మారాయనీ
మారుతున్నాయనీ...
మారుతాయని నమ్మడం
ఆత్మవంచనే!
- అరుణ నారదభట్ల