Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిక్కిన కడుపుకు
గుప్పెడు మెతుకులు పెట్టలేని
అమృత ఘడియలెందుకు
మనిషి పుట్టుకను ఆపలేని
దుర్ముహూర్తం ఊసెందుకు
మంచి, చెడులను నిర్ధారించలేని
తిథుల కుతి ఎందుకు
జీవిత గమనానికి దిక్సూచులవలేని
హస్తరేఖల గోలెందుకు
అభాగ్యుల జీవితాల్లో
చిరునవ్వులు పూయించలేని
చిలుక పలుకులెందుకు
జీవితంలోని ఆటు, పోట్లకు
పరిష్కారం చూపలేని జాతకచక్రం చుట్టూ
గిరికీలు కొట్టడమెందుకు
మన బలహీనతే మంత్రగాడి బలం
పేదోడి కన్నీళ్లే
బాబాలు, స్వాములకు పెట్టుబడి
నాటి ఆశ్రమాలలో జ్ఞాన బోధ జరిగేది
నేటి ఆశ్రమాలలో
సమస్యల సొద మారుమోగుతోంది
మూఢవిశ్వాసాలను నూరిపోస్తూ..
నిలువు దోపిడీ చేస్తూ..
బాబాలుగా అవతారమెత్తుతున్న వేళ
మనిషి జీవితమే ఒక గ్రంథం
నీ మెదడే జ్ఞాన భాండాగారం
స్థిమితమైన ఆలోచనే
సమస్యకు పరిష్కారం
తలరాతంటూ నిరాశతో క్రుంగిపోక
కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో
ముందుకు సాగిపో..
నీ జీవితానికి చుక్కానివి నీవేనని
తెలుసుకొని మసులుకో
- గుండు కరుణాకర్,
9866899046