Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మళ్ళొచ్చె ఎలచ్చన్లు ఐదేళ్ళలో
గెలిసినంక ఎన్నడు కానరాని లీడరు
ఉండి ఉండి బుగ్గకారు దిగి ముంగిట్లోకే వచ్చే
దండం పెడుతూ కడుపుల తలపెట్టిండు
గడ్డం పట్టిండు అలుముకున్నడు
ఒకటా రెండా 'ఎన్నికళ'లు అతనిలో ఉన్నవనుకున్నరు
పసిపోరనికి తానం ఏడ్చే పసిబిడ్డకు జోల
డకల్ బండి మీద గరం బజ్జీలు ఏసే
హౌటల్ల ఛాయ అందించే
ఇస్త్రీ జేసే పలుగుపట్టె పారపట్టె తట్ట నెత్తికెత్తే
రోడ్లు ఊడ్చే స్వచ్ఛ భారత్ కంటే నయంగనే
ఒకరింట్ల తిన్నట్లు నటించె
గొడ్సేపు పాడెనెత్తుకునే బలంగా కళ్ళనీళ్ళు తెచ్చుకునే
ఎన్నో సిత్రాలు నటనా 'విశ్వరూపాలు'
ఎన్నడు ముఖం సూపనోడు
పోయినోడిని దగ్గరకు దీయనోడు గియాలొచ్చే
ఎన్నో కళలతో... ఎన్నికవుదామని
'మీట' నొక్కేవరకు మచ్చికవుదామని
'ఓటు నాకేనని' బుదకరించే
'ఓటరే దేవుడంటూ' కాళ్ళు మొక్కే
గాలిలో దండిగా హామీలిచ్చే
ఎంగిలి చేతిని విదిలిస్తడంట మంత్రదండములెక్క
పథకాల వంట్లు బహుచక్కగా ఏరుకోవచ్చునంట
మళ్ళొక లీడరు వచ్చె
రంగుల రంగుల జెండాల కండువాలతో
గల్లీ రంగులమయం కావట్టే
పార్టీ జెండాలు వేరయినా
ఖద్దరు వేసుకునే నాయకులు ఒకటే
కిస్మత్ కులాయించి గెలిస్తే అధికార పార్టీల దునుకుడే
గట్లు లేవు తనుగులు లేవు ఇజ్జత్ లేదు
'ఆముదాని' పెంచుకోవడమే నాయకగుణం
జనామోదం ఎవడికి గావాలె
ఓళ్ళకు ఓటేసిన గంటల్నే మునకేసినట్లు
ఎలచ్చన్లు ఏంటికో...
కోకాకోలాలు తాగమని జెప్పే సిన్మా వీరోలు, సెలబ్రిటీలు
ఓటు విలువ గురించి జెప్పవట్టే
దొంగే 'దొంగ దొంగ' అని అరిసినట్లు
గీ నడుమ సిరా వేలు సూపుడు ఫాషనాయే
ప్రజాస్వామ్యాన్ని నిలువునా మోసం చేస్తున్నట్లే కనపడతున్నది
అవి అక్రమార్కుల్ని ప్రశ్నించే కొడవళ్ళుగా
ఎప్పుడు మారునో...?
అన్న... దేశంల నాయకులున్నరా?
ఉంటే చెప్పుండ్లే... 'గొల్ల రామవ్వ' లెక్క కాపాడుకుంటం
- బి.వేణుగోపాల్ రెడ్డి,
9908171441