Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ మంచు కన్నులగుండె
ద్రవించుతూనే వుంది
తులిప్ పూల పలకరింపుకోసం
కుంకుమ పత్ర మిత్రత్వంకోసం
కవాతు సైనికుల బూట్లశబ్ధాన్నిమోస్తూ
నిశ్శబ్దంగా......
ఆ మంచు కన్నులగుండె
ద్రవించుతూనే వుంది
మూసిన ఇంటి
తలుపు వైపు చూసి
మోగని కంఠాల కన్నీటిని కాచి
నిన్న కల్లోలాల్లో కరిగి
నేడు నిప్పుల్లోకి దొరలి
ఆ మంచు కన్నుల గుండె
ద్రవించుతూనే వుంది...
అల్లుకున్న తీగల పైకి
తుపాకీల పహారా కట్టి
సోయగాలలోయలను
గాయాలతొ తెగ్గొట్టి
ఊయలనూపుతానంటూ
ఊరేగుతున్న ప్రలాపాలనుకని
ఆ మంచు కన్నులగుండె
ద్రవించుతూనే వుంది...
రక్తమోడుతున్న దేహంపై
కత్తులతో కారుణ్యపుస్పర్శ
స్వేచ్ఛాశ్వాసలమూసిన
చేతుల చేతలు చూసి
ఆ మంచు కన్నుల గుండె
ద్రవించుతూనే వుంది...
ప్రజాస్వామ్య ఆక్రమణలో
పరిమళానికి ఉరిముడేసి
దేవదారు సౌందర్య రాశిని
మార్కెట్ కు వేలాడదీసిన
సాహసికుల పరిహాసాల విని
ఆ మంచు కన్నులగుండె
ద్రవించుతూనే వుంది
- కె.ఆనందాచారి