Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్థానం అంటే ఒక ప్రయాణం, ఒక మార్గం. ఒక మామూలు వ్యక్తికి తన జీవన మార్గంలో ఎదుర్కొన వ్యక్తుల అనుభూతులను, క్షతగాత్రుల మానసిక వేదనలను సాహిత్యానుశీలనతో గమనించిన అంశాలలో నుండి పదమూడు అనుభవాలను, సమాజంలో మనకు నిత్యం కనిపించే వ్యక్తుల అంతరంగాలను ఈ పుస్తకంలో రచయితయై, కథా నాయకుడై పరిచయం చేశాడనటం కంటే తనే చెప్పాడనవచ్చును.
కుల వర్గ పోరాటాలు, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలు, బాలబాలికలను ఎత్తుకెళ్ళి వారిని బిక్షాటనకు, దొంగతనాలకు, దోపిడీలకు ఎలా వాడుకుంటున్నారో, వేశ్య జీవన స్థితి గతులను, ఉన్నత విద్యలు చదివి ఉద్యమం వైపు మరలి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారికోసం కన్న తల్లిదండ్రుల మనస్థితులను ఇందులో పూలోజు రామాచారి కథ ద్వారా, ఎన్కౌంటర్ (ఊహాత్మకత) ద్వారా చెప్పారు. పుట 152లో ''నీ తండ్రి నీ గురించి ఎంత ఆవేదన పడుతున్నాడో, నీ తల్లి నీ కోసం ఎలా పిచ్చిదయిందో - అలాగే కన్న కొడుకు గురించి తల్లిదండ్రులు పడే ఆవేదన ఎలా వుంటుందో భావాలకందకుండా ఎలా వుంటుందో నీ తండ్రి ద్వారా తెలుసుకున్నా''నని అంటూనే, అంతటితో సరిపుచ్చుకోకుండా ఈ 'ప్రస్థానము' ముఖ్యోద్దేశాన్ని ఇలా అందించారు - ''నేను అభిలషించకుండా నేను చేస్తున్న నా ప్రయాణాన్ని ఎన్నో జీవితానుభవాల, సమాహారాల వెనుక చరిత్రకు కనిపించని చీకటి కోణాల వాస్తవాలు'' మనముందు వుంచారు. ఈ ప్రస్థానం మనను ఆలోచింపచేస్తుంది. మన సమాజాన్ని పరిచయం చేసినందుకు రచయితకు అభినందనలు.
ప్రస్థానం (అనుభవాల + ఊహాత్మక సమాహారం), రచన : సమతా శ్రీధర్, పేజీలు : 236, వెల : 80/-, ప్రతులకు : సమతా నర్సింగ్హౌమ్, కవిరాజనగర్, ఇల్లందు రోడ్, ఖమ్మం.
- డా||టి.శ్రీరంగస్వామి,
9949857955