Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అనేక సంఘర్షణల/ సంఘటనల సమాహారం నా కవిత్వం/ అలవోకగా విస్తరించే మనోసమతౌల్యం నా కవిత్వం'' అంటూ తన కవిత్వమేమిటో తెలుపుతున్న కవయిత్రి భానుశ్రీ కొత్వాల్. జ్ఞాపకాల్ని జారిపోకుండా, తన అనుభవాల్ని రంగరించి, సమాజ ముఖచిత్రంపై కమ్ముకుంటున్న చీకట్లను పరిశీలించి వేదనాభరిత హృదయగాథలను కవితాక్షరాలుగా చేసి ముందుకు సాగుతున్నారామె.
''ఆకలి కేకలు నినదించినప్పుడు/
హక్కుల పత్రాలు కాలరాసినప్పుడు/
విజయ బాటలో నడవాల్సిన/
స్వేదబిందువుల నైపుణ్యం/
అలసి సొలసినప్పుడు/
శ్రమ మూలాల్లో మొలచిన సౌజన్యం/ ప్రశ్నించక తప్పదు'' అంటూ శ్రమ మొలిచిన సౌజన్యానికి, నైపుణ్యానికి విలువ ఏ మాత్రం లేని సమాజాన్ని నిలదీస్తుందామె.
ఆమె ఇటీవల వెలువరించిన 'మొలక' కవితా సంపుటి నిండా పరుచుకున్న కవిత్వం అభ్యుదయ భావాల్ని పంచుతూ, స్త్రీ వేదనలని తెలుపుతూ సాగుతుంది. సమాజం ఇలా సామాన్యంగా ఉండడం చూసి భానుశ్రీ తీవ్ర వేదన చెందుతారు. ఆ వేదనను అక్షరాలల్లో ఇమిడ్చి కవిత్వంగా మలవడంతో ఒక ప్రతిభావంతమైన నిపుణతను చూపిస్తారు.
''విప్లవ పూలన్నీ అగ్గిరాజేసి/
సమ్మె సమ్మెట/
నగారా మోగించక తప్పదు/
యుద్ధం జరగాల్సిందే భావాత్మకమైనా సరే వ్యూహాత్మకమైనా సరే/'' అంటూ నేటి సమాజ రుగ్మతలపై యుద్ధ నగారా మోగిస్తారామె. ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్య పంథాలో తన అక్షరాలను కవాతు చేయిస్తారామె.
''మనిషిలోని మహామనీషి/
మాయమయ్యాడు/
క్రాంతి రథచక్రాలనెక్కి/
సారథ్యం చేసే/
మంచిమనిషి మాయమయ్యాడు/'' అంటూ మానవత్వం నశించిన ఈ కాలాన్ని కళ్ళకు కడతారామె. భానుశ్రీ కొత్వాల్ అందించిన ఈ 'మొలక'తో ఆమె కవిత్వం మహావృక్షంగా విస్తరించాలని ఆశిద్దాం.
మొలక, రచన : భానుశ్రీ కొత్వాల్, పేజీలు : 90, వెల : 90/-, ప్రతులకు : 9866863913.
- కె. హరనాథ్,
9703542598