Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధిపేట పట్టణంలోని అందమైన లాల్కమాన్ బొమ్మ ముఖచిత్రంగా సిద్ధిపేట జిల్లా సాహిత్య చరిత్రను పప్పుల రాజిరెడ్డి రాశారు. తెలంగాణ సాహిత్య అకాడమి వారి ప్రోద్బలంతో తెలంగాణలోని అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు నమోదు చేసే క్రమంలో ఈ పుస్తకం రాశారు.
కేవలం సాహిత్య చరిత్రలే గాక సిద్ధిపేట జిల్లా భౌగోళిక చారిత్రకాంశాలు, ఇక్కడి సహజ వనరులు, నేలలు, అడవులు, వాగులు, చెరువులు, ప్రాజెక్టులు, జనాభా అక్షరాస్యత, చారిత్రక క్రమం, శాసనాలు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, జాతరలు, దర్శనీయ స్థలాలు, సంగీత సాంస్కృతిక, నాట్య కళారంగాల వైభవాలను ఇందులో ఉల్లేఖించారు.
జిల్లా నామ నేపథ్యాన్ని చెపుతూ నవనాథ సిద్దుల్లో ఒకరు ఈ ప్రాంతాన సిద్ధి పొందటం వల్ల లేదా నిజాం నవాబుల సేనాని సిద్ధిఖీ పేరునో ఈ ప్రాంతాన్ని సిద్ధపురిగా, ఆ తర్వాత సిద్ధిపేటగా మారిందని చెపుతూ వచ్చారు. సాహిత్య చరిత్ర నిర్మాణాన్ని ఈ రచయిత 20వ శతాబ్దపు పూర్వ భాగం నుండి సేకరించినట్లు ద్యోతకమవుతుంది. అయితే అనేక సాహితీ ప్రక్రియలు ఈ ప్రాంతంలో రూపొందినట్లు పేర్కొన్నారు. శిల్పకళ, చిత్రకళ, నాట్యకళ, సంగీత కళ, చలన చిత్రరంగం వంటి విభిన్న కళలను పరిచయం చేయడంతో పాటు, వాటిల్లో నిష్ణాతులైన వారిని కూడా పేర్కొని చరిత్రలో నిక్షిప్తం చేశారు. సింహభాగంలో మాత్రం సాహితీ సంస్థల ఏర్పాట్లు, వాటి కృషి విధానాలను భావితరాల వారికి తెలియ వచ్చేటట్లు రాశారు.
సిద్ధిపేట జిల్లా సాహిత్య చరిత్ర, రచన : పప్పుల రాజిరెడ్డి, పేజీలు : 95, వెల : 40/-, ప్రతులకు : తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ - 4
- కె.హరనాథ్,
9703542598