Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశం ఆమె కనుకొలనుల్లో మేఘాల సంతకం చేసింది
అప్పుడే అనుమానించాను, వారిద్దరి మధ్య చెడిందేమోనని..
ఆమె కొండల కనురెప్పలు విప్పిచూస్తే
ఎప్పట్లానే తూరుపు ఎర్రబారిందనుకొన్నాను
అది రోజువారీ అరుణోదయం కాదు
లావాలు సుడితిరుగుతున్న కడుపు
వేదన అని ఆలస్యంగా గ్రహించాను
ఆ పాటికే ఆలస్యం అయింది
ఆమెను ఎలా చల్లబరచాలో తెలియకుండా ఉంది
ఎంత క్షమయా ధరిత్రీ అన్నా
ఆమెదీ ఆడమనసే కదా!
పట్టించుకొనే నాథుడు పాలకడలిలో దాక్కుని
లక్ష్మీవైభవాన్ననుభవిస్తూంటే
ప్రతి దురాశా పీడిత దౌర్భాగ్యుడూ
తనపై ప్రయోగాలు చేస్తూంటే
చెట్టూ చేమా పుట్టా గుట్టలైన తన సంతతిని
ప్రతివాడూ కొల్లగొడుతూంటే
అమ్మ మనసు ఎంత కాలం సహిస్తుంది
ఆడమనసు ఎంత కాలం ఓర్చుకొంటుంది
అందుకే పంచభూతాల సాక్షిగా ఆమె తిరగబడింది
తన ధార్తరాష్ట్ర దుస్సంతతికి తనే బుద్ధి చెప్పాలనుకొంది
క్రిమిదండులతో, తనే కురుక్షేత్రం ప్రకటించేసింది
ఏ పరీక్షిత్తు మిగులుతాడో మీరే పరీక్షించుకొమ్మంది
జనమే'జయ' యాగానికి
తన కడుపునే హౌమగుండంగా మార్చుకొంది...
-ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ, 9441809566