ముంగేర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓ అక్రమ గన్ ఫ్యాక్టరీ బయటపడింది. నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఓ ఇంటిపై మెరుపు దాడిచేసిన పోలీసులు దీన్ని రట్టుచేశారు. ఇవాళ ఉదయం ముగ్నేర్ జిల్లా తెరాసి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిథిలో అక్రమంగా తుపాకుల తయారీ సాగుతున్నట్టు గుర్తించామని ఎస్పీ లిపి సింగ్ వెల్లడించారు. ఆయుధాలు, వాటిని తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. ఇందులో నాలుగు నాటు తుపాకీలు, బిగించేందుకు సిద్ధంగా ఉంచిన ఐదు 9 ఎంఎం పిస్టళ్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు మరో 10 పిస్టళ్లు తయారు చేసేందుకు తెచ్చిపెట్టిన ముడి పదార్థాలు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు లిపి సింగ్ పేర్కొన్నారు. సదరు ఇంటి యజమాని విజయ్ శర్మను అరెస్ట్ చేసి.. అక్రమ ఆయుధాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు దీనిపై ముమ్మర విచారణ చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm