హైదరాబాద్ : కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ బుక్ ఖాతాలో శుక్రవారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఫన్నీగా ఉండటం, ఆ ఫన్నీ వీడియోకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తమదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ జోడించడంతో ఇట్టే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఏప్రిల్ 15వ తారీఖున ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వెళ్తున్నారు. వాళ్లకు కొద్ది దూరంలోనే ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ వస్తోందని గ్రహించారు. ఆ స్కూటీని నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదు. ఏ ఒక్కరూ మాస్క్ ధరించలేదు. పోలీసులకు చిక్కితే వాళ్ల లాఠీలకు పని చెబుతారని గ్రహించి, ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అందులో ఇద్దరు పరారయ్యారు. ఓ వ్యక్తి మాత్రం సాధారణ పౌరుడిగా వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన జేబులో ఉండే మాస్కును తీసి పెట్టుకున్నాడు. పోలీస్ వ్యాన్ అతడి పక్కగా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లి ఏమీ తెలియనట్లు వారితో మాట్లాడాడు. ఇంకేముంది హమ్మయ్యా బతికి పోయామని అనుకున్నాడు. కానీ ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోను పోలీసులు 'అమాయకుడిగా నటిస్తున్న ఓ బ్రదర్ ను చూడండంటూ' శీర్షిక పెట్టి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm