హైదరాబాద్: హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ అధికారులు ఓ కారు యజమానికి ఆన్లైన్ ఛలానా పంపారు. దీంతో ఖంగుతిన్న సదరు కారు యజమాని కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఛలానా పంపడమేమిటా అని ఆరా తీశాడు. తన కారు నెంబర్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి యాక్టివాకు పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని తెలుసుకుని విస్తుపోయాడు. వివరాల్లోకి వెళితే .. కర్మన్ఘాట్ ప్రాంతంలో ఉండే కె.రామలింగానికి మారుతీ ఆల్టో (టీఎస్08యూఏ 7094 ) ఉంది. ఇదే నెంబర్ను ఓ వ్యక్తి యాక్టివా వాహనానికి పెట్టుకుని బాలానగర్లో ఈ నెల 4న హెల్మెల్ లేకుండా వెళ్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసి ఆన్లైన్లో ఛలానా పంపారు. ఇది కారు యజమాని ఫెనాల్టీ ఛలానాల ఖాతాలోకి చేరడంతో అతను ఆందోళనకు గురయ్యాడు. తన కారు నెంబర్ను ద్విచక్రవాహనానికి పెట్టుకుని నడుపుతున్న వ్యక్తిపై చర్య లు తీసుకుని తనకు పంపిన ఛలానాను ఉపసంహరించుకోవాలని ఆయన ట్రాఫిక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm