హైదరాబాద్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఫుల్ గా మద్యం సేవించి ఓ శృంగార తారపై చేయి చేసుకున్న సంఘటన లండన్ నైట్ క్లబ్ లో జరిగింది. శృంగార తార వేలెరీ ఫాక్స్ ముఖంపై షేన్ వార్న్ కొట్టడంతో ఆమె కన్ను వాచిపోయింది. ఈ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫాక్స్, షేన్ వార్న్ పై మండిపడుతూ వ్యాఖ్యలు చేసింది. 'ఓ మహిళపై చేయి చేసుకుని గర్వంగా ఫీలవుతున్నావా? నువ్వు ఎంత పేరుపొందిన వ్యక్తివి అయితే మాత్రం ఓ మహిళను కొట్టి తప్పించుకుందామని అనుకుంటున్నావా?..' అంటూ ఆమె మండిపడింది. కాగా, ఈ సంఘటనపై ప్రత్యక్షసాక్షులు స్పందిస్తూ, ఫాక్స్ ను షేన్ వార్న్ కొట్టగానే ఆమె కిందపడిపోయిందని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. వెస్ట్ మినిస్టర్ లోని హెర్ట్ ఫోర్డ్ స్ట్రీట్ లో ఉన్న ఓ నైట్ క్లబ్ లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్టు స్కాట్లాండ్ యార్డు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, గతంలో కూడా షేన్ వార్న్ తన అసభ్య ప్రవర్తన కారణంగా ఓ బ్రిటిష్ నర్సు ను ఇబ్బందిపెట్టాడు. ఆమెకు అసభ్య మెస్సేజ్ లు పంపించాడు. ఈ సంఘటన నేపథ్యంలో నాడు ఆసీస్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న షేన్ వార్న్ తన పదవిని కోల్పోయాడు. షేన్ వార్న్ కు అక్రమసంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన భార్య సిమోన్ కూడా ఆయనకు దూరంగా ఉంటోంది.
Mon Jan 19, 2015 06:51 pm