హైదరాబాద్ : అతని పేరు రవికుమార్. వయస్సు 28. కానిస్టేబుల్ ఉద్యోగం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో నివాసం. రెండేళ్ల క్రితం రంజిత (25) పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిదీ అన్యోన్యమైన జీవితం. భార్య అంటే రవికుమార్ కి ఎంతో ప్రేమ. అదే ప్రేమని భర్తపైనా చూపించింది రంజిత. రెండేళ్లు అయినా ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. ఈ విషయంపై ఎప్పుడూ మధనపడుతూ ఉండేది రంజిత. ఎప్పటికప్పుడు సర్ధిచెబుతూ వచ్చేవాడు రవి. ఎక్కువగా ఆలోచించొద్దు.. ఏమంత వయస్సు అయిపోయింది అని ఓదార్చేవాడు. పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచించటంతోపాటు మనోవేదనకు గురైంది రంజిత. ఈ పరిస్థితుల్లో.. మార్చి 22వ తేదీ భార్య రంజిత ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు భర్త, కానిస్టేబుల్ రవికుమార్. భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. గురువారం సాయత్రం భార్య అంత్యక్రియలు నిర్వహించారు. అందరితోపాటు ఇంటికి వచ్చాడు. ఒంట్లో బాగోలేదంటూ గదిలోకి వెళ్లాడు. భార్య చనిపోయిందనే మనోవేదనతో శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. రవికుమార్ అంత్యక్రియలను పోలీస్ లాంఛనాలతో పూర్తి చేశారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. పిల్లలు పుట్టరనే బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ సీఐ రవికుమార్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm