హైదరాబాద్: శుభకార్యానికి వెళ్లి కుటుంబంతో తిరిగి వస్తున్న కారును దర్శకుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది. అమీర్‌పేటకు చెందిన హర్మీందర్‌సింగ్ ఐ 10 కారులో కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం అయ్యప్ప సొసైటీలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అర్ధరాత్రి తిరిగి బయలు దేరారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 33 వద్దకు రాగానే అదే దారిలో వస్తున్న దర్శకుడు బాబీ కారు వెనుక నుంచి వచ్చి వారిని ఢీకొట్టగా హర్మీందర్‌సింగ్ కారు ధ్వంసమైంది. హర్మీందర్ దర్శకుడి కారును అడ్డగించగా.. బాబితోపాటు మరో ముగ్గురు కారు దిగారు. తాను పెద్ద దర్శకుడిని అని.. అధికారులు తెలుసంటూ బాబీ బెదిరించాడు. తన ఇల్లు పక్కనే ఉందని.. అక్కడకు వెళ్లి మాట్లాడుకుందామని చెప్పాడు. దీనికి హర్మీందర్ సమ్మతించాడు. ఇంతలో అతడి తల్లి రీతు కౌర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో హర్మీందర్ ఆమెకు సపర్యలు చేస్తుండగా బాబీ కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితులు ఫోన్లో పవన్ సర్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురైందని హర్మీందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దర్శకుడు బాబీ సినీ ప్రముఖుల పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం చేశాడంటూ ఆరోపించాడు. పోలీసులు కూడా సరిగా స్పందించడం లేదన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm