Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న వివక్షా పూరిత వైఖరి మరోసారి తేటతెల్లమైంది. గవర్నర్ వద్దనున్న పెండింగ్ బిల్లుల అంశంలో ఇది మరోసారి ప్రస్ఫుటమైంది. సుప్రీంకోర్టు మందలించటం వల్లనో... మరే కారణం వల్లనో తెలియదు గానీ, ఇటీవల మన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్... తన వద్ద నున్న వాటిలో కొన్ని బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణలు అడిగారు. మరికొన్నింటిని తిప్పి పంపారు. తద్వారా తన వద్ద ఎలాంటి పెండింగ్ బిల్లులూ లేవని 'అనిపించారు...' కాగా ఈ అంశంలో రాజ్యాంగ ప్రతినిధి అయిన గవర్నర్, ప్రభుత్వం మధ్య వాదోపవాదలు కొనసాగుతున్నాయి. బిల్లుల్లోని సాధారణ సాంకేతికాంశాలను సాకుగా చూపి... వాటిని పక్కన పెట్టేందుకు రాజ్‌భవన్ ప్రయత్నిస్తోందనటంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు.
ప్రభుత్వ వైద్యరంగంలోని వివిధ ఉన్నతాధికారులు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్ల పదవీ విరమణ వయస్సును 61ఏండ్ల నుంచి 65ఏండ్లకు పెంచటం వల్ల ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనీ, అందువల్లే సంబంధిత బిల్లును తిరస్కరించానంటూ గవర్నర్ చెప్పటం ఇక్కడ గమనార్హం. అయితే ఇక్కడ ఆర్థిక భారాలు, ఖజానా తిప్పల గురించి ఆలోచించాల్సింది... అంచనా వేయాల్సింది... భరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప రాజ్‌భవన్ కాదు. ఈ చిన్నపాటి లాజిక్కు గవర్నర్ బంగ్లాకు తెలియదని మనం భావించాలా..? మరోవైపు 'యువతకు ఉద్యోగాలు, పిల్లలకు ఉత్తమ విద్యనందించేందుకు వీలుగా ప్రొఫెసర్ల నియామకానికి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలాంటి విధానం బీహార్ తదితర నాలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది...' అంటూ మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరించారు. మన గవర్నర్ మాత్రం అందుకు సంబంధించిన బిల్లుని ఏడు నెలలుగా తొక్కిపెట్టటం విస్తుగొలిపే అంశం.
ఈ రకంగా బిల్లుల లొల్లి కొన్ని నెలలుగా కొనసాగుతున్నప్పటికీ దీని వెనుకున్నది మాత్రం ఫక్తు బీజేపీ అజెండానే. రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కులంటే ఎంతమాత్రమూ గిట్టని కాషాయ పరివారం... గవర్నర్లను అడ్డుపెట్టుకుని కావాలనే రాష్ట్రాలతో గిల్లికజ్జాలాడు తోంది. ఒక్క తెలంగాణ ప్రభుత్వమే గాదు... కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు, అక్కడి ప్రభుత్వాలతో సైతం ఇదే రకంగా అది సయ్యాటలాడుతోంది. 'మాకు లొంగుంటే ఒక లెక్క... లేకపోతే మరో లెక్క...' అన్నట్టుగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. అది ఈ మధ్య మరింత పరకాష్టకు చేరి... అది బిల్లుల రూపంలో బయటపడుతోంది.
బలమైన రాష్ట్రాల ద్వారానే బలమైన కేంద్రం సాధ్యమైన నగ సత్యాన్ని కేంద్రం పట్టించుకోకపోవటం వల్లే రాష్ట్రాల పట్ల ఈ వివక్ష, కక్షలు కొనసాగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆరెస్సెస్ మూల సిద్ధాంతాల ఆధారంగా ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ... రాష్ట్రాలు బలంగా ఉండాలని ఎలా కోరుకుంటుంది..? అందుకే వాటికున్న సర్వ హక్కుల్నీ కాలరాసి... స్వేచ్ఛను హరించి తన పబ్బం గడుపుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నది. అందుకు ఓ పావుగా ఉపయోగపడే సాధనమే గవర్నర్ వ్యవస్థను పావుగా వాడుకుంటున్నది. తద్వారా తను అనుకున్న పనులను నిరాటంకంగా, యధేచ్ఛగా నిర్వర్తించేలా అది ప్రణాళికలను రూపొందించుకుంటున్నది. దాని ప్రణాళికలను బద్ధలు కొట్టటమే ఇప్పుడు ప్రతిపక్షాల ముందున్న అసలు సిసలు సవాల్.
ఈ క్రమంలో ఒక్క బిల్లుల గురించే కాదు... రాజ్యాంగం తమకు కల్పించిన సర్వ హక్కులపైనా రాష్ట్రాలు గొంతెత్తాలి. నిధులు, విధులు, అధికారాలపై నినదించాలి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో ఇప్పుడు మరింతగా పిడికిలి బిగించి... బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జనానికి విడమరిచి చెప్పాలి. ఈ కర్తవ్యాన్ని వామపక్షాలు భుజాన వేసుకుని తమ వంతుగా ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి. బాధ్యత ఎక్కువగా ఉన్న అధికార బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఆ బాధ్యతను అది మరింత సమర్థవంతంగా పోషించాల్సిన తరుణం ఆసన్నమైంది.