Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడీ బోధేమిటి! భజరంగ దళీయులు మాత్రమే భక్తులా? వేరేవాళ్లు కారా? దేవుళ్లపేరు చెప్పి సానుభూతిని పొందటం కోసం చేసే జిమ్మిక్కులు ఎంతకాలం చేస్తారు? విధ్వంసాలకు, హత్యలకు కూల్చివేతలకు పాల్పడుతున్న వాళ్లు రాముని ఆంజనేయుని భక్తులెలా అవుతారు! చిన్నతనంలో రాముని, కృష్ణుని, ఆంజనేయుని, భాగవత వేశాలేసుకుని, ఇంటింటికీ తిరిగి పద్యాలు పాడి అడుక్కుని బతుకుదెరువు గడుపుకునేవారు. వీళ్లు మాత్రం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, భక్తుల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ వేశాలను దొంగ ఏడ్పులను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.
'నను మనసారా ఏడ్వనీయండి' అని కృష్ణశాస్త్రిగారు అప్పుడెప్పుడో తీవ్రంగా దుఃఖపడ్డాడు. ఏడ్పులు నానారకాలుంటాయి. బాధను కన్నీళ్లుగా చేసి బరువుదించుకోవటం ఒక విధం. ఏడ్చి పనులు నెరవేర్చుకోవటాన్ని తరచూ చూస్తూంటాం. రామాయణంలో కైకేయి అలక మందిరంలో ఏడుస్తూ ఉందని తెలుసుకున్న దశరథుడు వెంటనే అక్కడికి చేరుకుని ఆమె కోర్కెను తీరుస్తాడు. రామునికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం చేస్తాడు. రామున్ని అడవులకూ పంపిస్తాడు. కైకేయి ఏడుపు అదన్నమాట. అశోకవనంలోని సీత దుఃఖమూ మనకు తెలుసు. ఆకలితో బాధపడే వాడి దుఃఖానికీ, కోరుకున్నది లభించకపోతే వచ్చే ఏడుపునకు చాలా వ్యత్యాసముంటుంది. చిన్న పిల్లలు తాము కోరుకున్నది ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. ఆ తర్వాత వెంటనే ఏడుపు ఆపేస్తారు. ఇంకొందరికి తమకు లేకపోయినా ఎదుటివానికి ఉన్నదనే ఏడుస్తుంటారు. ఇదో రకం ఏడుపు. కొందరికి లేదని ఏడుపుంటే మరికొందరికి ఉన్నందుకూ ఏడుపుం టుంది.
ఏడుపంటే ఓ కథ గుర్తుకొచ్చింది. క్రౌంచపక్షుల జంటలో ఒక పక్షిని చంపేయటంతో దుఃఖిత పక్షిని చూసిన వాల్మీకి రామాయణాన్ని రాశాడు. నారదునికి కథను వినిపించగా కావ్యం బాగానే ఉంది కానీ... నీవు రాసిన దానికంటే హనుమంతుడి రామాయణం చాలా బాగుంటుంది అని అంటాడు. కావాలంటే కదళీవనానికి వెళ్లి హనుమంతుని కలువమని సలహా ఇస్తాడు. వాల్మీకి వనానికి వెళ్లి అక్కడ అరటాకుల మీది రామకథను చదువుతాడు. చదవడం పూర్తవగానే పెద్దగా ఏడ్వడం మొదలు పెడతాడు వాల్మీకి. మహర్షి ఏడుస్తున్నాడని తెలుసుకున్న హనుమ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మీరు రాసిన రామాయణం అద్భుతంగా ఉన్నదని, అందువల్ల ఏడుపు వస్తున్నదని వాల్మీకి జవాబిస్తాడు. బాగుంటే సంతోషించాలి గానీ ఏడవడం ఎందుకు? అంటాడు. హనుమంతుని రామాయణం చదివాక తన రచనను ఎవ్వరూ చదవరని, అందుకే ఏడ్పువచ్చిందని వాల్మీకి అంటాడు. వెంటనే హనుమ అరటాకులనన్నింటినీ చింపివేస్తాడు. ఎందుకలా చేశారు? మధురమైన రామకథ చెరిగిపోయింది కదా! అని ఆవేదన చెందుతాడు వాల్మీకి. దానికి బదులుగా హనుమ 'ప్రపంచం మిమ్మల్ని గుర్తుంచుకోవటానికి మీరు రామాయణం రాశారు. నేను రాముణ్ని గుర్తుంచుకోవటానికి రాశాను' అని చెప్పి వాల్మీకి కండ్లు తెరిపిస్తాడన్న కథ ఉంది. అందుకని ఇలాంటి ఏడుపులూ కొందరు రాతగాళ్లలో ఉంటాయి.
ఆ ఏడుపులెట్లున్నా మనముందూ కొందరేడుస్తున్నారు. వాళ్ల ఏడుపేమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి కర్నాటక ఎన్నికల్లో ఏడ్చినంత పనిచేస్తున్నారు. నన్ను ప్రతిపక్షాలు తొంభైసార్లు తిట్టారని ఓటర్లకు చెప్పుకొని ఏడ్చేశారు. ఇది ఓట్లను రాల్చేసుకోవటానికి ఏడ్చే ఏడుపు. చిన్నతనంలో అన్నదమ్ములం, అక్కా చెళ్లెళ్లతో తగాదాపడి, అమ్మకో నన్నాకో వీడు తిట్టాడని, కొట్టాడని చెపుతూ ఏడ్చేవాళ్లం. లేదా పక్కింటి మిత్రుడు తిట్టాడనీ ఏడ్చేవాళ్లం. అచ్చం అలా అనిపిస్తున్నది. దేశంలోని రైతుల, కార్మికుల, పేదల, ఆర్తుల మహిళల, పిల్లల ఏడ్పులను విని, వారి బాధలను తీర్చాల్సిన నాయకుడు, వాళ్ల ఏడుపును పట్టించుకోకపోగా తన గురించిన బాధల్ని చెప్పుకు ఏడ్వటం మొదటిసారిగా చూస్తున్నాం! ఈ ఏడుపు వెనకాల అధికారం పొందాలన్న వాంఛతప్ప మరేమీలేదు. మా మానప్రాణాలు కాపాడండి మహా ప్రభో అని ఢిల్లీ నడివీధిలో మహిళా మల్లయోధులు ఏడుస్తూ అర్థిస్తుంటే, కనీసం ఆలకించని పాలకుడు, తన కోసం తాను ఏడుస్తూండటం వింత చర్య. పాలకులెవరైనా తాము చేసిన పనిని, చేయబోయే పనిని, ప్రజలకు ఏమి అందిస్తారో అని చెప్పి సాధారణంగా ఓట్లు అడుక్కోవటం ఉంటుంది. ప్రజలకేం ఇస్తారో చెపుతారు. కానీ ఈ ఏడుపు గొట్టు నాయకుడు హనుమంతున్ని తలుచుకొని ఓటేయమంటున్నాడు. హనుమాన్ చాలీసాను చదవమంటున్నాడు. కొన్ని తరాలుగా ఈయన పుట్టక ముందు నుండే ప్రజలు ఆంజనేయున్ని పూజిస్తున్నారు. హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నారు. ఇప్పుడీ బోధేమిటి! భజరంగ దళీయులు మాత్రమే భక్తులా? వేరేవాళ్లు కారా? దేవుళ్లపేరు చెప్పి సానుభూతిని పొందటం కోసం చేసే జిమ్మిక్కులు ఎంతకాలం చేస్తారు? విధ్వంసాలకు, హత్యలకు కూల్చివేతలకు పాల్పడుతున్న వాళ్లు రాముని ఆంజనేయుని భక్తులెలా అవుతారు! చిన్నతనంలో రాముని, కృష్ణుని, ఆంజనేయుని, భాగవత వేశాలేసుకుని, ఇంటింటికీ తిరిగి పద్యాలు పాడి అడుక్కుని బతుకుదెరువు గడుపుకునేవారు. వీళ్లు మాత్రం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, భక్తుల పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటూ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ వేశాలను దొంగ ఏడ్పులను ప్రజలు జాగ్రత్తగా గమనించాలి.