Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గవర్నర్ల వ్యవస్థకి సంబంధించిన ఈ రెండు తీర్పులూ కేంద్రానికి పరోక్ష హెచ్చరికల్లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకల్లాంటివి.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం, కుదరకుంటే ఇబ్బం దులకు గురిచేయడం, ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవడం కేంద్రానికి ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పాలకపక్షానికి వత్తాసు పలికే గవర్నర్ల వ్యవహార శైలికి ఈతీర్పు చెంపపెట్టులాంటిది.
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన రెండు తీర్పులు కేంద్రానికి చెంపపెట్టులాంటివి. అందులో ఒకటి ఢిల్లీలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం అంశం కాగా, రెండోది మహారాష్ట్రలో గవర్నర్ వ్యవహార శైలికి సంబంధించినది. అయితే ఈ రెండు తీర్పులూ గవర్నర్ల వ్యవస్థను వెలేత్తిచూపేవిగానే ఉన్నాయి. అయితే తెరవెనక కథ నడిపే కేంద్రమే అసలు దోషి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్న లెప్టినెంట్ గవర్నర్ వ్యవహారంగానీ, మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో గవర్నర్ కోష్యారి ఏకపక్ష వైఖరి గాని కేందం కనుసన్నులలో అక్కడి ప్రభుత్వాలను అస్తిరపరిచేవిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే.ఈ తీర్పులు దాన్ని మరింత బహిర్గతపరిచే అంశాలే కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రధానంగా ఢిల్ల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్నికైనప్పటినుంచి ఏదోరకంగా కేంద్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే చేస్తోంది. ఢిల్లీ పాలనాధికారులు ఎవరి పరిధిలో పనిచేయాలి?అనే విషయమై అనేకమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి.
సాధారణంగా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ఆయా రాష్ట్రాల అధికారులు అమలు జేయాలి. కానీ, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం గనుక ఆ సూత్రం వర్తించదన్నది కేంద్రం వాదన. దేశ రాజధానిలో రాష్ట్రపతి, ప్రధాని, విదేశీ రాయబారుల వంటి సెలబ్రెటీలు నివసిస్తారు గనుక వారి శాంతిభద్రతలు తామే చూస్తున్నాం గనుక పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం తమదేనని అంటోంది. దానికి సంబంధించి 2015లో ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 2019లో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ అప్పీ లుకు వెళ్లగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ నేతత్వంలోని ధర్మాసనం తాజాగా కీలకమైన తీర్పునిచ్చింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని సర్వోన్నత న్యాయ స్థానం స్పష్టం చేసింది.దీనికితోడు పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదంటూ ద్విసభ్య ధర్మా సనంలోని జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక విజయం.
ఇక మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించిన విషయంలోనూ అప్పటి గవర్నర్ వ్యవహరించిన తీరును కోర్టు తప్పుపట్టింది.రాష్ట్ర శాసనసభలో బలాబలాల పరిస్థితి తెలుసుకోకుండా, బలపరీక్ష కోరడం అనైతికమని తేల్చింది. ఈ కేసులో అప్పుడున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను బలపరీక్షను కోరే ముందు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని గవర్నర్ అంచనా వేయడంలో విఫలమయ్యారని స్పష్టం చేసింది. గవర్నర్‌ది తప్పని సుప్రీంకోర్టు మందలించినా ఇదేమీ తనను శిక్షించినట్టు కాదని కోష్యారి ప్రకటించడం వెనుక అంతర్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. నడిపించేదంతా నాయకులైనప్పుడు ఇలాంటి వారంతా తప్పు చేసి కూడా తమదేం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. కోష్యారి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఆయన అవివేకమనిగాక ఇంకేమనుకోవాలి?ఉద్దవ్ థాక్రే కూడా తొందర పాటు నిర్ణయం తీసుకున్నారని, పార్టీ చీలిక నేపథ్యంలో బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడం వల్ల ఆయన రాజీనామాను రద్దుచేసి, మళ్లీ ముఖ్యమంత్రిగా చేయలేమని కోర్టు పేర్కొంది. రాజీనామా చేయకుండా థాక్రే సంయమనం పాటించి వుంటే ఆయన్ని తిరిగి సీఎంగా కూర్చోబెట్టవచ్చని చెప్పింది. అయితే తీర్పుననుసరించి థాక్రే గ్రూపునకు చెందినవారు షిండేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగారు. ఇది కొంతకాలం మహారాష్ట్ర రాజకీయాల్లో మరింత నిప్పురాజేసే అవకాశాలున్నాయి.
గవర్నర్ల వ్యవస్థకి సంబంధించిన ఈ రెండు తీర్పులూ కేంద్రానికి పరోక్ష హెచ్చరికల్లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకల్లాంటివి.బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోయడం, కుదరకుంటే ఇబ్బందులకు గురిచేయడం, ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడవడం కేంద్రానికి ఓ విధానంగా సాగుతోంది. ఇందుకు గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికీ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పాలకపక్షానికి వత్తాసు పలికే గవర్నర్ల వ్యవహార శైలికి ఈతీర్పు చెంపపెట్టులాంటిది.