Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు యాభయ్యేండ్లు పూర్తిచేసుకున్న సందర్భమిది. 1973 ఏప్రిల్ 24న వెలువడిన ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థలోనే కాదు, ఆధునిక భారత చరిత్రలోనే అత్యంత కీలకమైనదీ, విశిష్టమైనదీను. ఈ యాభైయేండ్లలో ఈ దేశ న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలలో ఏ సమస్య వచ్చినా ఈ తీర్పు ప్రస్తావన తప్పనిసరిగా మారడం తెలిసిందే. ఎందుకంటే భారత రాజ్యాంగానికి రక్షణ కవచం లాంటి తీర్పు ఇది. అందుకే దీనికి అంతటి ప్రాధాన్యత. ప్రత్యేకించి నేడు భారత రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ మున్నెన్నడూ ఎరుగని ప్రమాదకరమైన సవాళ్ళు ఎదురవుతున్న సమయంలో ఈ తీర్పు, ఈ సందర్భం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ మన రాజకీయ వ్యవస్థలో గానీ, మీడియాలోగాని ఈ సందర్భానికి తగిన చోటే లేకపోవడం ఓ విషాదం. అయితే, మన రాజకీయ పార్టీల ధ్యాసంతా ఓట్లు, సీట్ల చుట్టే పరిభ్రమిస్తున్నందున, మీడియాలో ప్రధాన భాగం ఏలినవారి స్తోత్రాలాపనలోనే తీరికలేకుండా తరిస్తున్నందున ఇదేమీ అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ ఈ తీర్పు వెలుగులో మన వర్తమానాన్ని పరిశీలించడం, ఈ దేశ భవిష్యత్తును నిర్మించుకోవడం పౌరులుగా మన బాధ్యత.
తీర్పు పూర్వాపరాల్లోకి వెళితే... 1969లో నాటి కేరళ ప్రభుత్వం భూసంస్కరణల చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా కేశవానంద భారతికి చెందిన మఠం ఆధీనంలోని 400 ఎకరాల భూమిలో 300 ఎకరాలు స్వాధీనం చేసుకుని పేదలకు పంచింది. దీనిని సవాలు చేస్తూ, ఇది భారత రాజ్యాంగం కల్పించిన పౌరుల వ్యక్తిగత ఆస్తిహక్కుకు భంగం కలిగించే చర్యగా ఆరోపిస్తూ కేశవానంద భారతి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ కేసులో కేశవానంద భారతికి ఓటమే ఎదురైంది. ఆ సమయంలో ఇలాంటివే ఇతర అనేక కేసులపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఆస్తిహక్కు, సమానత్వపు హక్కు, మత స్వాతంత్రపు హక్కులంటే ఏమిటో విస్తృతంగా చర్చించింది. అన్నిటికీ మించి శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల విధివిధానాల గురించీ, పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేపట్టవచ్చా లేదా అన్న అంశం గురించి లోతైన విశ్లేషణ చేయటమే కాదు, వీటన్నిటిపై ఈ తీర్పు తిరుగులేని స్పష్టత నిచ్చింది. లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర స్వభావాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాలని పునరుద్ఘాటించింది. ఈ తీర్పు ప్రకారం... పరిస్థితులకు అనుగుణంగా పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేపట్టవచ్చు. కానీ పీఠికలో పేర్కొన్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదు. పౌర స్వేచ్ఛకు, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు. భారతదేశం సమాఖ్య వ్యవస్థ. అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు. కనుక రాష్ట్రాలు, కేంద్రానికి మధ్య జరిగిన స్పష్టమైన అధికార విభజనను పాటించాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రను దెబ్బతీయకూడదు. అంతిమంగా సమస్త వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని ఈ తీర్పు నిర్దేశించింది.
కానీ నేడు జరుగుతున్నదేమిటి? ఈ దేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తూ, చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యాంశాలనే మార్చేస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. విదేశీ వలస పాలన నుంచి విముక్తి కలిగించిన జాతీయోద్యమాన్ని పక్కనపెట్టి విదేశీయుల దండయాత్రల గురించి చెపుతారట. రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ భావాలకు స్వస్తి చెప్పి మనుస్మృతిని బోధిస్తారట. జాతీయవాదం ముసుగులో ''ఒకే దేశం ఒకే ప్రజ'' అనే విధానంతో భిన్నత్వంలో ఏకత్వమనే వైవిధ్యభరితమైన ఈ దేశ పునాదులనే సమాధి చేస్తారట. ఇప్పటికే ''ఒకే దేశం - ఒకే పన్ను, ఒకే దేశం - ఒకే విధానం'' అంటూ కేంద్రం ఏకపక్షంగా రాష్ట్రాల అధికారాలను ఒక్కటొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. ఇది చాలదన్నట్టు గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు మోకాలడ్డుతూ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న ఘటనలనేకం మన కండ్లముందే జరిగిపోతున్నాయి.
ప్రధానీ, ఆయన మంత్రివర్గ సహచరులూ న్యాయవ్యవస్థ మీదా, జడ్జీల మీద బహిరంగంగా 'దాడి'కి తెగబడటం నేడొక నిష్టూర సత్యం. ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నా, కొత్త చోట అధికారంలోకి రావాలన్నా బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని తెగనాడటం నిత్యకృత్యమైంది. దీనిలో భాగమే మొన్న ప్రధాని సివిల్ సర్వీస్ అధికారుల మీటింగ్లో ప్రతిపక్షాలపై, వారి ప్రభుత్వాలపై చేసిన బహిరంగ దాడి. భారత రాజ్యాంగానికీ, దానికి రక్షణ కవచంలా నిలిచే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకూ తూట్లు పొడుస్తూ, వాటిని పురాతత్వ అంశాలుగా మార్చజూస్తున్నారు. ఈ కుతంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖండించాలి. లేదంటే ఈ దేశమే మిగలదని పౌర సమాజం గ్రహించాలి.