Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోరు మెదపని ఎమ్మెల్యే చల్లా
- కాంగ్రెస్ పరకాల ఇన్చార్జి ఇనుగాల
నవతెలంగాణ-వరంగల్
పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలం గొర్రెకుంట సమీపంలోని మల్లికుంట చెరువు శిఖంలోని సర్వేనెంబర్-93లో రూ.3 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలంపై పరకాల ఎమ్మెల్యే స్పందించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గొర్రెకుంట మల్లికుంట చెరువు శిఖం కబ్జాకు గురైన ప్రాంతాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సొంత ప్రయోజనాలే ముఖ్యమని ప్రభుత్వ స్థలం కబ్జా అయినా పట్టించుకోడన్నారు. 20 రోజులుగా కబ్జా జరుగుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కబ్జాదారులపై కాని, అధికారులపైగాని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నా యన్నారు. తనకు సంబంధించిన వారి భూముల కోసం ఎమ్మార్వోలతో, పోలీసులతో బెదిరించడం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. నాలా భూములు, చెరువు భూములు కబ్జా చేస్తుంటే ఎమ్మెల్యే నోరు తెరవకపోవడం దారుణమన్నారు. తక్షణమే చెరువు భూమి కబ్జాను ఆపాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకొని ధర్మారెడ్డిగా వుంటావో, లేక అధర్మారెడ్డిగా వుండి ప్రజాకోర్టులో నిలబడుతావో తేల్చుకోవాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి కొమురారెడ్డి, మాజీ సర్పంచ్ మ్యాదరబోయిన చక్రపాణి, ఎస్సీసెల్ కన్వీనర్ బొడ్డు అనిల్, దాసారపు సారయ్య, ల్యాదెల్ల సంపత్ తదితరులున్నారు.