Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో మంత్రి కేటీఆర్ సమావేశం !
- అనంతరం వరంగల్ పర్యటన
నవతెలంగాణ-వరంగల్
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్‌ప్లాన్ -2041కు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపలేదు. 2017-18 నుండి ఈ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తూనే ఉన్నారు. గతేడాదిగా ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేయడమే తప్పా నేటికీ ఆమోదముద్ర పడలేదు. మూడేండ్లుగా మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం లభించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈలోపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం సైతం ముగిసింది. గతేడాది లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన పలు సందర్భాల్లో వాయిదా పడుతూ నేటికీ రాని పరిస్థితి. దీంతో వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేటికీ ప్రారంభోత్సవం జరుగలేదు. పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి వున్నా, చేయకపోవడంతో ఆ పనులు ప్రారంభం కాలేదు.
కాకతీయ అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మాస్టర్‌ప్లాన్ 2041 నేటికీ ఆమోదముద్ర పడకపోవడం విమర్శలకు తావిస్తుంది. 2017-18లో రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్‌లో అనేక సవరణలు చేసిన అనంతరం ఆమోదముద్ర వేయడానికి ముహుర్తం కుదరడం లేదు. 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 181 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గ్రేటర్ వరంగల్ నగరానికి సంబంధించింది వుంది. మొత్తం 13 మండలాలలో మాస్టర్‌ప్లాన్ విస్తరించి వుంది. అంతవరకు బాగానే వున్నా, నేటికీ మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలుపకపోవడంతో అత్యంత ప్రాముఖ్యమైన అభివృద్ధి పనులకు మోక్షం లేకుండా పోయింది. వరంగల్ జిల్లాలో 144 రెవెన్యూ గ్రామాలు, కరీంనగర్ జిల్లాకు చెందిన 27 రెవెన్యూ గ్రామాలు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానున్నాయి.
ఆమోదంలో తీవ్ర జాప్యం
మాస్టర్‌ప్లాన్‌లో తీవ్ర జాప్యం నెలకొనడంతో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడకన
నడుస్తున్నాయి. 5 నియోజకవర్గాలను కలుపుతూ వుండే రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) 132 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి వుంది. ఇందులో 29 కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారుల శాఖ నిర్మించింది. మరో 68 కిలోమీటర్ల రహదారిని ఆర్ అండ్ బి శాఖాధికారులు నిర్మించాల్సి వుంది. ఈ రహదారి స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, హుజురాబాద్, హుస్నాబాద్, పరకాల నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. జాతీయ రహదారుల శాఖ నిర్మించిన 29 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ రహదారి జాతీయ రహదారి 163కు బైపాస్రోడ్డుగా నిర్మించారు. ఆర్ఆర్ఆర్ పరిధిలోనే ఐటి పార్క్‌లు, విద్యాసంస్థలు భారతీయ విద్యాభవన్, హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ వంటివి రానున్నాయి. ఇండిస్టియల్ జోన్, సెటిలైట్ టౌన్‌షిప్‌లను ప్రతిపాదించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తిలో, దేవునూరు గుట్టలు, ధర్మసాగర్ రిజర్వాయర్ మధ్య రిక్రియేషన్ జోన్ ఏర్పాటు కానుంది. ఇవన్నీ కావాలంటే ముందు మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదముద్ర లభించాల్సి వుంది. నగరవాసులు ఎంతో ఆశగా ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నా, ఇప్పటికీ ఆమోదముద్ర పడలేదు.
త్వరలో మంత్రి కేటీఆర్ సమావేశం
త్వరలో మాస్టర్‌ప్లాన్‌పై రాజధానిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులతోపాటు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం తెలిపే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. చాలాసార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీంతో నగరాభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటుంది.
వరంగల్‌కు మంత్రి కేటీఆర్ రాక ?
రాజధానిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాస్టర్‌ప్లాన్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన వరంగల్ నగరంలో పర్యటించే అవకాశమున్నట్లు సమాచారం. గత ఏడాదిగా మంత్రి కేటీఆర్ పర్యటన నగరంలో వాయిదా పడుతూ వస్తుంది. వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ, అమృత్, హృదరు పథకాల కింద జరుగుతున్న పనులు పూర్తి కాకపోవడం పట్ల పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే జిల్లా ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో మంత్రిని జిల్లాకు ఆహ్వానించిన రాలేదనే విషయం తెలిసిందే. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరిగే అవకాశం వుండడంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేసి నగరవాసుల మదిని చూరగొనాలని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన వుంటుందని భావిస్తున్నారు. నగరంలో భద్రకాళి బండ్ సుందరీకరణ పనులు, పలు స్మార్ట్ సిటీ రోడ్డు పనులతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, రాంపూర్ అర్భన్ పార్క్, శిల్పారామం, నగరానికి నలువైపులా కాకతీయ కీర్తి తోరణాల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేసే అవకాశముంది. 13 కిలోమీటర్ల మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డును రూ.50 కోట్ల అంచనాతో నిర్మించాల్సి వుంది. ఈ పనులకు మంత్రి శంకుస్థాపన చేయాల్సి వుంది. ఇందులో భూ సేకరణకే రూ.200 కోట్లు ఖర్చు కానున్నాయి. ఈ పనులన్నీ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వస్తేనే ప్రారంభమయ్యే అవకాశముంది. గత ఏడాదిగా మంత్రి పర్యటనలు ఖరారైనా చివరి నిమిషంలో వాయిదాపడుతూ ఇప్పటికీ మంత్రి రాకపోవడంతో అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులు ప్రారంభం కాలేదు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ త్వరలోనే ఖరారవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.