Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ సీడీ సంపత్రావు
నవతెలంగాణ-శాయంపేట
ఉపాధి హామీ పనుల పై 13వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక గురువారం రెండో రోజు కొనసాగింది. 11 గ్రామాలపై డీఆర్పిలు నివేదిక సమర్పించారు. అనంతరం రూ.3లక్షల90వేల900 రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలంలో ఫిబ్రవరి 2019 నుండి మార్చి 2021 వరకు రూ.9కోట్ల25లక్షలతో ఉపాధి పనులు జరిగాయి. ఈ పనులపై బుధవారం ప్రజావేదికలో నివేదికలను చదివి వినిపించారు. 13 గ్రామాలపై సమగ్ర విచారణ జరపగా రాత్రి కావడంతో గురువారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో తిరిగి ప్రజావేదిక కొనసాగించారు. ఏడు రకాల రిజిస్టర్ లకు బదులు నాలుగు రకాల రిజిస్టర్లు మాత్రమే మెయింటెన్ చేస్తున్నట్టు డీఆర్పిలు తెలిపారు. శాయంపేట లో ఫిష్ పాండ్ లో కూలీల సంతకాలు లేకుండా పని చేసినట్టు చూపించారని, జెసిబి తోనే పని చేసినట్లు వెల్లడైందని తెలిపారు. ఒక మస్టర్లో అందరి కూలీల సంతకాలు ఒక్కరే పెట్టినట్టు గుర్తించామన్నారు. మైలారంలో టేకు మొక్కల డబ్బులు పంచగిరి రజిత బదులుగా భాస్కర్ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్లో మునగ మొక్కలు నాటగా చనిపోయాయని తెలిపారు. ప్రగతి సింగారం లో మొక్కలు లేకున్నా ఉన్నట్టు రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్లు తెలిపారు. అనంతరం పీడీ సంపత్ రావు మాట్లాడుతూ మస్టర్లు సెల్ ఫోన్ నుండి పెట్టాలని సూచించారు. ప్రతి బుధవారం జరిగే సమావేశంలో ఉపాధి పనులపై అవగాహన పెంచుకోవడానికి డి ఆర్ పి ని పంపిస్తానని అన్నారు. ఎస్ఆర్డిఎస్ రూల్స్ ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకోవాలని అన్నారు. ఉపాధి పనులు చేయించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని అన్నారు. అలసత్వం చేస్తే నోటీసులు వస్తాయని, ఉద్యోగానికి భద్రత లేకుండా పోతుందని హెచ్చరించారు. ఎఫ్ఏల నుండి రూ.27,555, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల నుండి రూ.7,208, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్ల నుండి రూ.1లక్ష17వేల828, ఈసీ నుండి రూ.88,614, గత ఎంపీడీవో నుంచి రూ.2,500, ఏ పీ ఓ నుంచి రూ.7,500, పంచాయతీ కార్యదర్శుల నుండి రూ.24,117, ఇతరుల నుండి రూ.లక్ష17వేల78 రికవరీకి ఆదేశించినటు పీడీ సంపత్రావు తెలిపారు. సంబంధిత ఎంపిడివో ద్వారా ఆయా అధికారులకు నోటీసులు జారీ చేసి నగదు రికవరీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపిడి వసుమతి, ఎంపీడీవో కష్ణమూర్తి, ఎస్ టి యమ్ అజరు కుమార్, ప్రోగ్రామింగ్ మేనేజర్ అశోక్, ఎస్ ఆర్ పి ఝాన్సీ, ఏపీఓ కీర్తి అనిత, ఎంపీవో రంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, డి ఆర్ పి లు పాల్గొన్నారు.