Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు డీఆర్వో కూతాటి రమాదేవి
- పరామర్శ, ఆర్థికసాయం అందజేత
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని లింగాల ఎర్రగళ్లకు ఇండ్లు కాలిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని డీఆర్వో కుతాటి రమాదేవి, డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య తెలిపారు. తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బందితో కలసి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను గురువారం డీఆర్వో పరామర్శించారు. సర్పంచ్ ఊకే మౌనిక నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో పూర్తిగా కాలిపోయిన ఇండ్లకు రూ.5 వేలు, పాక్షికంగా కాలిపోయిన ఇండ్ల కుటుంబాలకు రూ.2,500లు చొప్పున సాయం అందించారు. బాధితులు అధికారులను చూసి బోరున విలపించారు. ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్వో రమాదేవి స్పందించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇతర సాయం అందించేలా కషి చేస్తామన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాప సుగుణ నారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్, ప్రభుత్వ గిరిజన బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుతారి రమేష్, వీఆర్వోలు తాడెం వీరస్వామి, నర్సింహస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం చాటిన పీహెచ్సీ సిబ్బంది
మండలంలోని లింగాల గ్రామంలోని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు తాడ్వాయి వైద్య సిబ్బంది గురువారం బియ్యం, బట్టలు, కూరగాయలు, పప్పులు, ఉప్పు, చింతపండు, తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి శ్యాంసుందర్, సిబ్బంది సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం బాధితులకు వైద్యశిబిరం నిర్వహించి పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సమీపంలోని దుబ్బగూడెం సర్పంచ్ ఈసం కాంతారావు వ్యక్తిగతంగా రూ.2 వేలు, పంచాయతీ నుంచి రూ.2 వేలు సాయం అందజేశారు. అలాగే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం లింగాల గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు, యూత్, మహిళ నాయకులు రూ.వెయ్యి 116లు నగదుతోపాటు క్వింటా బియ్యం, ఇతర సరుకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ఇతర గ్రామాల ప్రజలు ముందుకొచ్చి సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో కొడిశల పీహెచ్సీ వైద్య సిబ్బంది, దుబ్బగూడెం గ్రామ పెద్దలు, యూత్, మహిళా సంఘాల నాయకులు, లింగాల గ్రామపంచాయతీ గ్రామ పెద్దలు యూత్ మహిళా తదితరులు పాల్గొన్నారు.