Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లకు పటిష్టమైన ఏర్పాట్లు
- గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-మహబూబాబాద్
సాగునీటి సరఫరా కోసం ప్రణాళిక చేయాలని, ధాన్యం కొనుగోళ్లకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ అంశాలపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సత్యవతి గురువారం సమీక్షించారు. అన్ని ప్రాంతాలకు సాగునీరు సరిపోయేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మున్నేరు వాగులోకి ఎస్సారెస్సీ నీరు తీసుకురావాలని, తాళ్లపూసపల్లి నుంచి ఈదుల పూసపల్లికి నీరు అందించాలని, గార్ల, బయ్యారం, రైల్వే క్రాసింగ్ అవతల ఉన్న భూములకు నీరందేలా చొరవ తీసుకోవాలని చెప్పారు. రైతులు భవిష్యత్లో నీటి కోసం ఇబ్బంది పడకుండా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ మళ్లీ విజంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని కోరారు. జిల్లాకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరైందని, త్వరలోనే నిధులు అందుతాయని ధీమా వ్యక్తం చేశారు. పట్టణ అవసరాలు తీర్చేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, మున్సిపల్ చైర్మెన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.