Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం సాయంత్రం కాటారం డీఎస్పీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో వంద మంది పోలీసులు, 15 మంది ఎస్సైల బృందం కార్డెన్ సెర్చ నిర్వహించారు. ప్రతి ఇంటిలో సోదాలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలిపెట్టారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ బోనాల కిషన్ మాట్లాడుతూ మహారాష్ట్రలో మావోయిస్టులు, పోలీసులకు ఎన్కౌంటర్ జరగడంతో అక్కడి నుంచి మావోలు తెలంగాణ ప్రాంతం వైపు వచ్చి ఉంటారని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. మావోయిస్టులకు సహకరించొద్దని, కొత్త వ్యక్తులు తారసపడితే సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్, కాళేశ్వరం, పలిమెల, కొయ్యూరు, కాటారం మహా ముత్తారం ఎస్సైలతోపాటు, ఇద్దరు సీఐలు, ట్రెయినీ ఎస్సైలు, సివిల్, సీఆర్పీఎస్ పోలీసులు పాల్గొన్నారు.