Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
వినియోగదారుల నుంచి అధిక చార్జీలు వసూలు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జేసీ కూరాకుల స్వర్ణలత అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మీసేవా కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఆన్లైన్ సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ప్రజల నుండి నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుములు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు తీసుకోవాలన్నారు. అధిక రుసుములు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తే మీసేవ కేంద్రాల నిర్వాహకులను తొలగి స్తామన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 4 మీ సేవా కేంద్రాలను అర్హత ఉన్న ఇతరులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీ సేవ కేంద్రాల నిర్వహణపై నివేదిక అందించాలని మీసేఆ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటిండెంట్ గౌస్, ఈడీిఎం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
బియ్యం వేలానికి చర్యలు తీసుకోవాలి
వివిధ సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని వేలం నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జేసీ కూరాకుల స్వర్ణలత పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అభివృద్ధి శాఖల అధికారులు, జిల్లా విద్యాశాఖాధికారితో సమావేశం నిర్వహించారు. 2020 మార్చిలో కరోనా లాక్డౌన్ నుంచి వివిధ సంక్షేమ హాస్టళ్ళలో భోజనం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసిన బియ్యం ఆయా విద్యాసంస్థల్లో నిలువ ఉన్నాయన్నారు. వాటిని సేకరించి వేలం వేయాలని పౌరసరఫరాలశాఖ ఇన్చార్జి అసిస్టెంట్, సివిల్ సప్లై ఆఫీసర్ మహమ్మద్ ముస్తఫాను ఆదేశించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో నిలువలో ఉన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి సునీత, డీఈఓ హైదర్ హై, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.