Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్ర జెండాలు పాతిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలోని వివిధ సర్వే నెంబర్ల పరిధి ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కాకతీయ నగర్లో సర్వే నెంబర్ 601 లోని 1.39 ఎకరాల ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు ఎర్ర జెండాలు పాతారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ భూము లను పరిరక్షిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే మరో వైపు నర్సంపేట పట్టణంలో అందుకు విరుద్ధంగా ఎక్కడికక్కడ అన్యాక్రాంతమౌతున్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రియాల్టర్లు ఆక్రమించుకుంటూ ప్లాట్లను విక్రయించి సొమ్ముచేసుకొంటున్నా చర్యలు చేపట్టడం లేదన్నారు. రెవెన్యూ అధికారులు ప్రేక్ష పాత్ర పోషిస్తున్నా రని విమర్శించారు. పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక దఫాలుగా పోరాటాల రూపంలో వినతులు అందించినా ప్రభుత్వ భూములే లేవంటూ అధికారులు దాటవేయడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టణంలో దాదాపు వేలాది మంది ఇండ్లు లేని పేదలు అద్దె ఇండ్లల్లో ఇక్కట్ల పాలవుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేదలు తలదాచుకొనేందుకు జానెడు జాగ కోసం గుడిసెలు వేసుకొంటే నిర్ధాక్ష్యణంగా తొలగించే చర్యలకు పూనుకొం టున్నారన్నారు. భూకబ్జాదారులు ఆక్రమించి సాగు చేసుకున్నా, రియల్ ఎస్టేట్ పేరుతో ప్లాట్లను అమ్ముకొం టున్నా కన్నెత్తి చూడకపోవడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో పూర్తిగా విఫలమై య్యారడానికి పట్టణంలో ఆక్రమణలే నిదర్శణమన్నారు. ఇప్పటికైనా ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వకుంటే ఆందోళనలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ(ఎం) పోరాటాలకు ప్రజలు మద్దతునిచ్చి అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్, అనంతగిరి రవి, బుర్రి ఆంజనేయులు, పట్టణ నాయకులు గుజ్జుల ఉమా, హన్మకొండ సంజీవ, ఎస్కే. హుస్సేన్, గుర్రం వెంకన్న గడ్డమీది బాలకృష్ణ పాల్గొన్నారు.