Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లను సమర్ధవంతంగా చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లు, కోవిడ్ నియంత్రణ, పర్యాటక అభివద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్, అధికారులతో గురువారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత అనుభవాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను పకడ్భందీగా చేపట్టాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, తాలు గురించి తెలిపేలా బోర్డు ప్రదర్శించాలని చెప్పారు. తేమ, తాలు విషయంలో రైతులకు అవగాహన కల్పించా లన్నారు. జిల్లాలో 3.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అంచనా ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి-2021 ధాన్యం కొనుగోలు కోసం 191 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 28 లక్షల గోనె సంచులు, 4592 టార్పాలిన్ షీట్లు, 203 తూకం యంత్రాలు, 5 గోదాములను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. అలాగే 35 రైస్ మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక్కో కేంద్రానికి ఒకరు చొప్పున అధికారిని బాధ్యుడిగా నియమించాలని, కరోనా నిబంధనలు పాటించాలని, చలువ పందిళ్ల, తాగునీటి సదుపాయం కల్పించాలని తెలిపారు. వచ్చే వానాకాలం పంటలు, సాగుపై ఇప్పటి నుంచే అధికారులు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9 వేల 675 మందికి మొదటి విడతలో, 2 వేల 461 మందికి రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు మంత్రి వివరించారు. ప్రతిరోజు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక అభివద్ధి కోసం ప్రభుత్వం రూ.34.50 కోట్లు కేటాయించగా అందులో పాలకుర్తికి రూ.10 కోట్లు, బమ్మెరకు రూ.7.5 కోట్లు, వల్మిడికి రూ.5 కోట్లు, జఫర్ఘడ్కు రూ. 6 కోట్లు విడుదలయ్యాయని, పెంబర్తికి ఇంకా మంజూరీ కాలేదని వివరించారు. పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాలకు గాను 187 యాసంగి కొనుగోలు కేంద్రాలతోపాటు జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల రెండో వారంలో కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో 646 కల్లాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. తేమ 17 శాతానికి మించకుండా ధాన్యం ఆరబెట్టి తేవాలని, కోవిడ్ నేపథ్యంలో ముందస్తుగా టోకెన్లు ఇస్తామని, కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పిస్తామని తెలిపారు. అన్ని గ్రామాల్లో విలేజ్ హెల్త్ రిజిస్టర్ నిర్వహించి ఆ ప్రకారమే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పర్యాటక అభివద్ధి పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ పంట దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు గన్నీ బ్యాగులు, తూకం, తేమ యంత్రాలు సమకూర్చాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రమణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, అబ్దుల్ హమీద్, తదితరులు పాల్గొన్నారు.