Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఛాన్స్ కోసం కడియం, బోడకుంటి ఎదురుచూపు
- లైన్లో సిరికొండ, సుధారాణి, తక్కళ్లపల్లి
నవతెలంగాణ-వరంగల్
ఏడుగురు శాసనమండలి సభ్యులు జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ లేదా మేలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఇదిలా ఉంటే కడియం, వెంకటేశ్వర్లు మరో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఆశావహులు ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, తక్కళ్లపల్లి రవీందర్రావులు లైన్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారన్న విషయం సస్పెన్స్‌గా మారింది.
జూన్‌లో ఏడుగురు శాసనమండలి ఎమ్మె ల్సీల పదవీకాలం ముగియనుంది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరితోపాటు మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి అవకాశం కోసం ఆ ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. కడియం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వెంకటేశ్వర్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. రాజకీయ సమీకరణలను బట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం ఎన్నిక చేయడం సహజం. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసిన విషయం విదితమే. దీంతో మళ్లీ బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారా? ఇచ్చినా వరంగల్ జిల్లా నేతలకు ఛాన్స్ దక్కుతుందా ? అనేది సస్పెన్స్‌గా మారింది.
'కడియం' ఆశలు..
ఎమ్మెల్సీ పదవి జూన్‌లో ముగియనుండగా మరోసారి ఎమ్మెల్సీ పదవిని కడియం శ్రీహరి ఆశిస్తున్నారు. శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సైతం మరోసారి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కడియం గత శాసనసభ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా, సీఎం కేసీఆర్ ఇవ్వలేదు. అనంతరం ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. కేబినెట్లో మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 'కడియం' తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 'కడియం'కు మళ్లీ ఎమ్మెల్సీ కావడానికి అవకాశం ఇస్తారా? అనే విషయంలో సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఒకవేళ ఛాన్స్ ఇస్తే కేబినెట్లో అవకాశం ఇవ్వాల్సి వస్తుందని సీఎం కేసీఆర్ భావిస్తే దూరం పెట్టవచ్చన్న ప్రచారం జరుగు తోంది. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కడియం, ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గ్రూపుల నడుమ ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమం లో ఈ పరిస్థితిని చల్లార్చాలంటే కడియంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక తప్పని పరిస్థితి. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడతారో అని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే బోడకుంటి సతీమణి ఇటీవల మృతి చెందింది. ఇప్పటికీ 2సార్లు వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ అవకాశం పొందారు. వివాద రహితుడిగా పేరున్న ఆయనకు మరోసారి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసొచ్చే అంశం.
ఎమ్మెల్సీ పదవి కోసం 'క్యూ'
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ పదవి కోసం చాలా మంది నేతలు ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ చేయనున్న కడియం, వెంకటేశ్వర్లుతోపాటు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి, తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా ఆశిస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి సిరికొండ ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. బీసీ ామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో సిరికొండకు అవకాశం ఇవ్వచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ గుండు సుధారాణి సైతం ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. బీసీ మహిళలకు ఛాన్స్ ఇస్తే గుండు సుధారాణికి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తక్కళ్లపల్లి రవీందర్రావు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆయనకు సామాజిక సమీకరణల్లో భాగంగా కలిసొచ్చే అవకాశాలు తక్కువేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.