Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ స్థలం కబ్జా
- ఎమ్మెల్యే 'షాడో' దురాక్రమణ
- రూ.20 కోట్ల భూమికి ఎసరు
- అస్తవ్యస్తంగా ప్రయివేట్ వెంచర్
- 105 మంది కొనుగోలుదారులు బజారుపాలు
నవతెలంగాణ-వరంగల్
ఖిలావరంగల్ మండలం ఉర్సు శివారులో ఎమ్మెల్యే 'షాడో' సుమారు రూ.20 కోట్ల విలు వైన 3.37 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్ర మించి గోదాములు నిర్మించాడు. ఆ ప్రభుత్వ భూమిని తాజాగా పక్కనే వున్న బృందావన్ వెంచర్లో ఉన్నట్లు అవినీతికి పాల్పడ్డ అధికా రులు పక్కా రిపోర్డులు సృష్టించారు. తెర వెనక అవినీతి భాగోతం నడవడంతో బృందావన్ వెంచర్లో పలు నిర్మాణాలను ఖిలావరంగల్ తహసీల్దార్, సిబ్బంది కూల్చారు. ఈ విషయం తెలిసి ఆ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లబోదిబోమంటున్నారు. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు గోదాములను నిర్మించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు వ్యక్తే రెవెన్యూ అధికారు లకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చి తాను ఆక్రమించుకున్న సర్వే నెంబర్ 415ను ప్రయివేట్ వెంచర్లో చూపిస్తూ రికార్డులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపి సర్వే నెంబర్ 415లోని 3.37 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాల్సిన అవసరం ఉంది. కుడా అప్రూవ్డ్ లే అవుట్ నిర్మాణాలనే రెవెన్యూ సిబ్బంది కూల్చివేస్తే ఇక ఎలాంటి ప్లాట్లను కొనుగోలు చేయాలనే విషయంలో అధికారులు స్పష్టతనివ్వాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కుడా, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నిర్ధారించి న్యాయం చేయాలని కోరుతూ బృందావన్ వెంచర్ కొనుగోలుదారులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందించారు.
వరంగల్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు 'షాడో' ఎమ్మెల్యేగా భావిస్తున్న వ్యక్తి ఖిలావరంగల్ మండలం ఉర్సు శివారులో సర్వే నెంబర్ 415లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను నిర్మించిన గోదాముల కింద ప్రభుత్వ భూమిని అట్టి పెట్టుకొని పక్కనే ఉన్న బృందావన్ ప్రయివేట్ వెంచర్లో సర్వే నెంబర్ 415 ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు సృష్టించినట్లు సదరు ప్లాట్ల కొనుగోలుదారులు అంటున్నారు. ఈ విషయంలో ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే కూల్చి వేసినట్లు ఖిలావరంగల్ తహసీల్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. 2004లో ఏర్పడ్డ వెంచర్‌ను నాడు సర్వే చేసిన అనంతరమే కుడా డీపీ నెంబర్ 23/2004 ప్రకారం ఆమోదం తెలిపినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకుడి కార్యాలయ సిబ్బంది ఇచ్చిన నివేదికకు అనుగుణంగానే బృందావన్ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉందని, అందులో నిర్మించిన నిర్మాణాలను కూల్చి వేసినట్లు ఖిలావరంగల్ తహసీల్ అధికారులు చెబుతున్నారు. 2004లో ఏర్పడ్డ వెంచర్‌ను సర్వే చేసిన తర్వాతే కుడా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కుడా అధికారులు ధృవీకరించారు.
ఖిలావరంగల్ మండలంలోని ఉర్సు శివారులో 2004లో రూపొందించిన బృందావన్ వెంచర్లో 105 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. తాజాగా ఈ వెంచర్లో ఆకస్మికంగా ఖిలావరంగల్ తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది పలు షెడ్లను కూల్చి వేశారు. దీంతో ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు. 17 ఏండ్ల తర్వాత రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ స్థలం పేరిట కూల్చివేతలు చేపట్టడం, అదీ 'కుడా' అప్రూవ్డ్ లే అవుట్ ప్లాట్లలో ప్రభుత్వ భూమి వుందని కూల్చడాన్ని కొనుగోలు దారులు తీవ్రంగా నిరసించారు. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్, వరంగల్ అర్భన్ ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. తక్షణమే 'కుడా', రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసలు కథ..
ఖిలా వరంగల్ మండలంలోని ఉర్సు శివారులోని సర్వేనెంబర్లు 422, 423, 424, 427, 236, 416, 417, 393, 407, 410,411, 412, 413, 414లలో కుడా నిబంధనల ప్రకారం 2004లో 10.11 ఎకరాల స్థలంలో బృందావన్ ఎస్టేట్స్ పేరిట వెంచర్ వేశారు. ఇందులో సుమారు 105 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇందులో పలువురు ప్రహరీలను, మరికొంత మంది షెడ్లు నిర్మించుకున్నారు. ఇదిలా ఉండగా రెండ్రోజుల క్రితం ఖిలా వరంగల్ తహసీల్ కార్యాలయ సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెంచర్‌లోని పలు కట్టడాలను కూల్చి వేశారు.
'షాడో' ఎమ్మెల్యే పనే..
2004 నుంచి లేని ప్రభుత్వ భూమి 2021లో ఈ మధ్యనే బృందావన్ ఎస్టేట్స్‌లో ఎలా పుట్టుకొచ్చింది ? అని ప్లాట్ల కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాక సమీపంలో వరంగల్ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు 'షాడో' ఎమ్మెల్యేగా ముద్రపడ్డ వ్యక్తి గోదాములు నిర్మించాడు. ఈ గోదాముల స్థలంలోనే ప్రభుత్వ స్థలం కూడా ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సర్వే నెంబర్ 415లోని భూమిని ఆక్రమించి గోదాములను నిర్మించిన సదరు 'షాడో' ఎమ్మెల్యే ఆ ప్రభుత్వ భూమిని బృందావన్ వెంచర్లో ఉన్నట్లు రెవెన్యూ అధికారులతో రికార్డులు సృష్టించి కొత్త డ్రామాకు తెరతీశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నోటీసులు ఇవ్వకుండానే సర్వే డ్రామా..
ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సిబ్బంది సర్వే చేసి నివేదిక ఇచ్చిన దాని ప్రకారమే బృందావన్ వెంచర్లో సర్వేనెంబర్ 415ను గుర్తించినట్లు ఖిలా వరంగల్ తహసీల్దార్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాన్ని గుర్తించినప్పుడు ఎవరికీ నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణలను కూల్చివేయొచ్చని అధికారుల వాదన. ఇదిలా ఉంటే సర్వే అధికారులు నోటీసులు జారీ చేయకుండానే కట్టడాలను కూల్చడం పట్ల ప్లాట్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా సర్వే చేసేటప్పుడు సదరు సర్వే నెంబర్ హద్దుల్లో ఉన్న సర్వే నెంబర్లలోని కాస్తు,కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడం ఆనవాయితీ. ఇవేవీ పాటించకుండానే సర్వే రిపోర్టు ఆధారంగా కూల్చామని రెవెన్యూ అధికారులు చెప్పడాన్ని తప్పు పడుతున్నారు.
కుడా అప్రూవ్డ్ వెంచర్లో 'రెవెన్యూ' దందా
బృందావన్ ఎస్టేట్స్‌కు కుడా 2004లోనే లే అవుట్ ఆమోదించింది. రెవెన్యూ అధికారులకు అభ్యంతరాలుంటే కుడా దృష్టికి తీసుకురావాల్సి ఉండగా కనీసం సమాచారం ఇవ్వకుండానే రెండ్రోజుల క్రితం ఆ వెంచర్‌లోని నిర్మాణాలను కూల్చారు. 2004లో ఈ వెంచర్ సమీపంలో చిన్న కుంట ఉండేదని, ఆ కుంట కట్ట దాటి దాని భూమి ఉండే అవకాశం లేదు. అయినా రెవెన్యూ అధికారులు కుడా అప్రూవ్డ్ లే అవుట్ ఆమోదం పొందిన వెంచర్లో కట్టడాలను కూల్చడం విమర్శలకు తావిచ్చింది. ఈ వివాదం కుడా, రెవెన్యూ, ల్యాండ్ రికార్డ్స్ అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేసింది. దీనిపై ఇప్పటికైనా సంయుక్తంగా సర్వే చేసి నిజాలు తేల్చి న్యాయం చేయాలని ప్లాట్ల కొనుగోలుదారులు కోరుతున్నారు.
స్పందించని అధికారులు
ఈ కట్టడాల కూల్చివేతలపై 'నవతెలంగాణ' ల్యాండ్ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌ను ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ఖిలా వరంగల్ తహసీల్దార్ మంజులను ఫోన్లో సంప్రదించగా ఆమె కూడా స్పందించలేదు.