Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి
- కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి తెలిపారు. లింగాల గ్రామంలో నష్టపోయిన చాపల పెంటమ్మ, చాపల సుధాకర్, చాపల కాంతారావు, చాపల కిష్టయ్య కుటుంబాలను శుక్రవారం కుమారస్వామి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు 25 కేజీలు చొప్పున బియ్యం అందించారు. అలాగే దుప్పట్లు, వంట సామాగ్రి, గిన్నెలు, గ్లాసులు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాల్లోని పిల్లలకు, పెద్దలకు, మహిళలకు, పురుషులకు దుస్తులు అందించారు. సర్పంచ్ ఓకే మౌనిక నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల పిల్లలకు బ్రెడ్ పాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సీతక్క సహకారంతో ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామన్నారు. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సీతక్క నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, ఆమె వచ్చాక మరింత సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్, ఉప సర్పంచ్ యాప సుగుణ నారాయణ, సీనియర్ నాయకుడు ముద్రకోళ్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీలు ఊకే పోతురాజు, పాయం నర్సింగరావు, యూత్ కాంగ్రెస్ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు చింతా క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలి ఔదార్యం
క్వింటా బియ్యం పంపిణీ
లింగాల అగ్ని ప్రమాద బాధితులకు సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు, స్థానిక అంగన్వాడీ టీచర్ సరోజనతోపాటు బోటిలింగాల అంగన్వాడీ టీచర్ రజని క్వింటా బియ్యం అందించి ఔదార్యం చాటుకున్నారు. తొలుత బాధిత కుటుంబాలను సరోజన, రజని పరామర్శించారు. ఈ సందర్భంగా సరోజన మాట్లాడారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడం సరికాదన్నారు. నిరుపేద కుటుంబాలు ఇండ్లు కాలిపోయి రోడ్డున పడగా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను తక్షణ సాయం అందించడంతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.