Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
పోడు భూములకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) పాదయాత్ర రథసారధి బంధు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధికి నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) పాదయాత్ర నాలుగో రోజు కనుకునూర్, కిష్టంపాడు, కామనపెల్లి మీదుగా పలిమెలకు శుక్రవారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిష్ణాపురంపాడు 1950 నుంచి రెవెన్యూ గ్రామమని, కోయా దొరలు 20 సంవత్సరాల వరకు నివాసం ఉండేవారన్నారు. పదేండ్లుగా వారి వారసులు ఇక్కడ భూమి సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డు కోవడం సరికాదన్నారు. ఇతర గ్రామాలకు వెళ్లిన వారు ఇప్పుడు గ్రామ శివారులో సాగు చేసుకుంటున్న రెవెన్యూ భూములకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వ అధికారులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు. వారి పంటను నష్టం చేసి ఇబ్బందుల పాలు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసి గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్లను అనుమతించాలని కోరారు. లేదంటే సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత గిరిజనులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, నూతన పింఛన్లు, రేషన్ కార్డు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాదయాత్ర బృందం సభ్యులు పసుల వినరుకుమార్, నాగుల అరవింద్, ఆత్కూరి శ్రీకాంత్, సూదుల శంకర్, దామెర కిరణ్, కుంజం బుదరం, గుర్రం దేవేందర్, బొట్ల చక్రపాణి, పొలం రాజేందర్, దామెర నరేష్, చిన్న బాబు, శీను పాపారావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.